ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 12: గురుకులాలు అపరిశుభ్రంగా మారిపోయాయని, విద్యార్థుల మృతికి ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గురుకులాలను క్లీన్‌గా ఉంచాలని, పాములు, తేళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లుల కడుపుకోతకు ప్రభుత్వం కారణమవుతున్నదని ఆగ్రహించారు. గురుకులాల్లో విద్యార్థుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి అనిరుధ్ మృతిచెందగా, బాలుడి అమ్మమ్మ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ధైర్యం కోల్పోవద్దని, అండగా ఉంటానని భరోసానిచ్చారు. 50వేలు ఆర్థిక సాయం చేశారు. బాలుడి తల్లి ప్రియాంక బాధ మరో తల్లికి రానీయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఆయన మాట్లాడారు.
పెద్దాపూర్ గురుకులంలో అపరిశుభ్ర వాతావరణంతో ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం, పలువురి పరిస్థితి విషమంగా మారడం బాధాకరమన్నారు. కొంత కాలంగా సంక్షేమ హాస్టళ్లలో ఆలనాపాలనా చూసుకునే నాథుడే లేకుండా పోయారనే నిజాన్ని తెలుసుకోవాలని సూచించారు. గడిచిన ఎనిమిది నెలల్లోనే గురుకులాల్లో పలు కారణాలతో 36 మంది పిల్లలు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు.
భువనగిరిలో, సూర్యాపేటలో ఆత్మహత్యలు, మృతి జరిగాయని, పాముకాటుతో, కల్తీ ఆహారం లాంటి సంఘటనలు జరగడం తరచూ చూస్తున్నామన్నారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి, వారి కుటుంబంలో ఒకరి ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గురుకులాల్లో విషాహారం, కల్తీ ఆహారం తినడం వల్ల 500 మంది విద్యార్థులను హాస్పిటల్లో చేర్చించిన విషయాన్ని గుర్తు చేశారు.
దుర్ఘటన జరిగితే ప్రభుత్వం మానవతా హృదయంతో స్పందించాలని, అందులో రాజకీయాలు అవసరం లేదని సూచించారు. ఇది వరకు బాసరలో జరిగినప్పుడు తాము కూడా వెళ్లి వారితో మాట్లాడి భోజనం చేసి వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద పిల్లలు బాగుండాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశారని, వాటిని జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసి కేజీ టు పీజీ విద్యకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
అనిరుధ్ తల్లి ప్రియాంక తనతో అన్నమాటను గుర్తు చేస్తూ మరో తల్లికి కడుపుకోత ఉండకుండా చూసేందుకు తన ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. పాఠశాలలను అధికారులు దత్తత తీసుకోవాలని, అప్పుడప్పడు ఆకస్మిక తనిఖీ చేస్తే సిబ్బంది క్రమశిక్షణతో పనిచేస్తారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 6.5 లక్షల మంది పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రిలా ఉండాలని ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని కోరుతున్నామని చెప్పారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో, జిల్లాలో జరిగే ఇలాంటి దురదృష్ట సంఘటనలపై ఎమ్మెల్యేకు, కలెక్టర్‌కు, అధికారులకు ముందస్తు, సమాచారం ఇవ్వాలని, పత్రికా విలేకరులను కోరారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, మాజీ ఎంపీటీసీ ఇల్లెందుల గీతాంజలి, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, డైరెక్టర్ ల్యాగల సతీశ్‌రెడ్డి, నాయకులు అందె సుభాష్, బొమ్మనవేణి సత్యం ఉన్నారు.
నాలాంటి భాద మరో తల్లికి రావద్దు
– అనిరుధ్ తల్లి ప్రియాంక
‘తమ కొడుకు హాస్టల్ల్ సిబ్బంది కన్నోళ్లలా చూసుకుంటరనుకుంటే చివరకు కడుపుకోత మిగిల్చిన్రు’ అని అనిరుధ్ తల్లి ప్రియాంక కన్నీటి పర్యంతమైంది. మాజీ మంత్రి కేటీఆర్ ఎదుట తన కొడుకును తలుచుకుంటూ గుండెలు బాధుకొని ఏడ్చింది. తన కొడుకు ఇంటికి వచ్చి వెళ్లిన మూడు రోజులకే మృతిచెందాడని, తన కడుపుకోత మరొక తల్లికి రాకుండా చూడాలని చెప్పింది.
కడుపుకోత మిగల్చవద్దు
గురుకులాల్లో విద్యార్థుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. పిల్లల తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చద్దు. పాముకాటుతో చనిపోయిన అనిరుధ్లాంటి పరిస్థితి ఏతల్లికి రాకుడదు. ఈ విషయంలో ప్రభుత్వం రాజకీయ బేషజాలకు పోవద్దు. రాష్ట్రంలోని గురుకులాల పనితీరు, పరిశుభ్రతపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనుభవం ఉన్న నాయకుడు, గతంలో గురుకులాల సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో కమిటీ వేస్తాం. నాలుగైదు రోజుల్లో కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి 20, 30 సంక్షేమ గురుకులాలను పరిశీలిస్తుంది. ఆయా స్కూళ్లలో లోటుపాట్లను గుర్తించి ప్రభుత్వానికి నిష్పక్షపాతంగా, నిర్మాణాత్మక సూచనలు చేస్తాం. అందులో ఎలాంటి రాజకీయం లేదు.
– కేటీఆర్