వేములవాడ, సెప్టెంబర్ 8 : యూరియా కావాలని తన ఆవేదనను వెల్లగకిన రైతులపై కేసులు పెడుతూ వేధిస్తామంటే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హెచ్చరించారు. గంటల తరబడి క్యూలో నిలబడిన రైతులకు మంచినీళ్లు ఇచ్చిన బీఆర్ఎస్ నాయకుల మీద కూడా కేసులు పెడుతూ వేధిస్తున్నారని మడ్డిపడ్డారు. తమపై కేసులేమీ కొత్త కాదని, రైతుల మీద కేసులు పెడితే మాత్రం ఖబడ్దార్ అని హెచ్చరించారు.
ఎరువుల కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమే కారణమని, ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలోని రోజులను తలపిస్తున్నాయని, ముమ్మాటికీ ఇది సర్కారు వైఫల్యమే అని విమర్శించారు. వేములవాడలోని ఆయన నివాసంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చల్మెడ మాట్లాడారు. యూరియా విషయంలో రేవంత్రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి మాట్లాడే మాటలకు సంబంధం లేకుండా ఉందని విమర్శించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామమైన రుద్రంగిలో యూరియా కొరత ఉందని రైతులు ప్రశ్నిస్తే వారిపై వేధింపులు ప్రారంభమయ్యాయని, తెల్లారేసరికి కాంగ్రెస్ నాయకులు బెదిరించి సమాధానం చెప్పించారని, కానీ నెలన్నర రోజులు గడుస్తున్నా యూరియా కొరత తీర్చడం లేదని మండిపడ్డారు. సిరిసిల్ల నియోజకవర్గంలోనూ లక్ష్మణ్ అనే రైతు ఆవేదనతో మాట్లాడితే అతనిపైనా కేసు నమోదు చేశారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సుమారు 21వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు కేవలం 15 వేల మెట్రిక్ టన్నులే వచ్చిందని, ఇంకా 6 వేల మెట్రిక్ టన్నులు ఎప్పటిలోగా అందజేస్తారో ప్రభుత్వ విప్ అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రహదారి విస్తరణలో ఒకరోజు సమయం కూడా ఇవ్వని ప్రభుత్వ విప్.. కూల్చిన మట్టిని నెలరోజులైనా తీయకుండా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయనకు కనీస అవగాహన లేదని, ‘కాళేశ్వమే లేకుంటే?’ అనే పేరుతో కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని అధికారులతో ఒత్తిడి తీసుకువస్తున్నాడని దుయ్యబట్టారు. విప్ ఆది శ్రీనివాస్ శిలాఫలకాల్లో గిన్నిస్ బుక్ రికార్డును పొందేటట్టు ఉన్నాడని ఎద్దేవా చేశారు.
భీమేశ్వరాలయంలో భక్తులకు ఏర్పాట్లు చేయనున్న 3.5 కోట్ల పనికి ఎనిమిది శిలాఫలకాలు వేశారని, ఒకే చోట జరిగే కార్యక్రమాలకు ఇన్ని శిలాఫలకాలు ఎందుకని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పే ఆయన, నియోజకవర్గానికి వచ్చిన నిధులపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పొలాస నరేందర్, తీగల రవీందర్ గౌడ్, రూరల్ సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, మాజీ కౌన్సిలర్లు మారం కుమార్, నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, గోలి మహేశ్, జోగిని శంకర్, నాయకులు పాల్గొన్నారు.
ఉపాధిని దెబ్బతీయద్దు
వేములవాడ రాజన్న ఆలయాన్ని దసరా తర్వాత మూసివేస్తున్నట్లు అధికారులే అధికారికంగా చెబుతున్నారు. సమ్మక భక్తుల దర్శనాలు పూర్తయ్యే వరకు తెరిచి ఉంచాలి. ఆలయానికి వచ్చే భక్తులపై ఆధారపడి ఉన్న వేల చిరువ్యాపారుల కుటుంబాల ఉపాధిని దెబ్బతీయద్దు. 611 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్నా ఎన్ని దశల్లో.. ఎంత కాలంలో పూర్తి చేస్తారో తెలుపాలి. 2024-25 సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లు దేవస్థానానికి పెడితే ఒక రూపాయి కూడా వినియోగించలేదు. 2025- 26వ బడ్జెట్లో 100 కోట్లు కేటాయింస్తే 150 కోట్లు కేటాయించినట్లు పత్రికల్లో చూశాం. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఆ నిధులు ఎలా ఉంటాయి? పనులు ప్రారంభం కాకపోతే ల్యాప్స్ అవుతాయి. ఈ విషయంపై అధికారులే నవ్వుకుంటున్నారు.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు