జగిత్యాల, జూలై 15 : సర్ ప్రక్రియ ఇంకా 50 శాతం కూడా పూర్తి కాలేదని, త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు బుధవారం జగిత్యాల రూరల్ మండ లం జాబితాపూర్‌లో సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ‘సర్’ ప్రక్రియను విజయవంతం చేయాలని బూత్ స్థాయి కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా జగిత్యాల ఆర్డీవోతో ఫోన్లో మాట్లాడుతూ, గ్రామంలో వరినాట్ల సమయం కావడంతో ఉదయం 9 గంటలకే వ్యవసాయ పనులకు వెళ్తున్నారని, సాయం త్రం 5 తర్వాత ఇంటికి వెళ్తేనే ఓటు నమోదు ప్రక్రియ విజయవంతంగా సాగుతుందని తెలిపారు.
2002లో ఓటు లేని వారికి ఇబ్బంది అవుతుందని, వారి వివరాలు రావడం లేదని, తహసీల్ ఆఫీస్‌లో ఫామ్స్ ఎంటర్ చేస్తున్నారని, ఈ క్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ స్టాఫ్‌ను పెంచాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలున్నాయని, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లతో మానిటర్ చేయించాలన్నారు. అలాగే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో సర్ కార్యక్రమాన్ని కౌన్సిలర్ ప్రదీప్, నాయకులు శ్రీరాముల గంగాధర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో, తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడారు.
అర్బన్‌లో సర్ ప్రక్రియ చాలా వీక్‌గా ఉందని, ప్రధానంగా మోతె రోడ్డులో సౌరాలు, మొండిగట్ట, గోత్రాల కాలనీ, బుడిగె జంగాల కాలనీ, గోవింద్‌పల్లి ప్రాంతంలో వరంగల్, నర్సంపేట ప్రాంతాల నుంచి వచ్చి ఉపాధి కోసం స్థిరపడ్డవారు ఉన్నారని చెప్పారు. వీరంతా పొద్దున పనులకు వెళ్లి సాయంత్రం 5 తర్వాత ఇళ్లకు వస్తారని, వారు అందుబాటులో ఉన్న సమయంలో బీఎల్వోలు ఉండేలా చూడాలని సూచించారు. ఆయన వెంట జాబితాపూర్ సర్పంచ్ పొలిశెట్టి మహేశ్, ఉప సర్పంచ్ మారిశెట్టి లక్ష్మణ్, చల్గల్ సర్పంచ్ జున్ను రాజేందర్, లక్ష్మీపూర్ సర్పంచ్ నల్ల స్వామిరెడ్డి-కవిత, బద్దం ఆదిరెడ్డి, తదితరులు ఉన్నారు.