జగిత్యాల, జూలై 10 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న ద్వేషం ప్రజలకు శాపంలా మారుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనన్న భయంతో అందుకు ఆయన అంగీకరించడం లేదని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులు పాటిజివ్ దృక్పథంతో ఉండాలని, కానీ, రేవంత్‌రెడ్డి అందుకు విరుద్ధమైన భావజాలంతో ఉన్నాడని విమర్శించారు. ఆయనకు కలలో సైతం కేసీఆర్ కనపడుతున్నారని, అందుకే బిత్తరపోతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో పరిస్థితులు మరో నెల రోజులు ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు, తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత స్వతంత్రంగా వ్యవహరించాలని, పరిస్థితి చేయిదాటి పోకముందే సాగునీటిని ఎత్తిపోసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. ప్రాణహిత జలాల వినియోగం కోసం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, 2004-2014 మధ్య కాలంలో తుమ్మిడిహెట్టి బ్యారేజ్ విషయమై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య ఏ విధమైన ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ప్రయాసలకు ఓర్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూ ర్తి చేశారని గుర్తు చేశారు. 2022లో 29 లక్షల క్యూసెకుల నీరు ప్రవాహం వచ్చినా ఆ ప్రాజెక్టు తట్టుకొని నిలబడిందన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీ ఎల్అండ్టీ మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మాణం చేపట్టిందని, ప్రమాదవశాత్తు 2023లో రెండు పిల్లర్లు దెబ్బతింటే నేటికీ ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదని మండిపడ్డారు. దెబ్బతిన్న పిల్లర్లు మరమ్మతులు చేపట్టి, మేడిగడ్డ బ్యారేజ్‌ను ఉపయోగించుకోవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2025 ఏప్రిల్‌లోనే నివేదిక ఇచ్చిందని, అయినా నేటికి మరమ్మతులు చేయడం లేదని ఆగ్రహించారు. ప్రాణహిత జలాల కోసం తుమ్మడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేపడుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్నదని, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 నెలలు గడిచినా, తట్టెడు మట్టి పోయలేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, నీటి కరువు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తి అన్నారంకు, అక్కడి నుంచి నీటిని ఎత్తి సుందిళ్లకు ఎత్తిపోసి, ఎల్లంపల్లికి తరలించడానికి పూర్తి అవకాశాలున్నాయన్నారు. దీనిపై మాజీమంత్రులు, కేటీఆర్, హరీశ్‌రావు ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా నివేదించినా.. ఎలాంటి చలనం లేకపోవడం బాధాకరమన్నారు. సుదీర్ఘ అనుభవమున్న రిటైర్డ్ ఇంజనీర్లు కూ డా కన్నెపెల్లి పంప్‌హౌస్ నుంచి 9టీఎంసీలు నీరు ఎత్తి పో సేందుకు ఉన్న అన్ని అవకాశాలపై సమగ్రమైన నివేదిక ఇచ్చారన్నారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజ్‌ను వినియోగించుకొని పరిమిత స్థాయిలో నీటిని ఎత్తిపోయాలని కోరితే, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.
మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్ల డ్యామేజ్‌ను సైతం ఎల్అండ్టీ రీస్టోర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. పనులు చేపట్టడం లేదని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వృథా పోతున్న నీటిని ఉపయోగించుకోవాలో చర్చించకుండా.. పంటల సాగుపై సమీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల విత్తనాలు వేయాలని సూచించిందని, అవి దీర్ఘకాలిక పంటలని, నీటి కొరత ఉన్నప్పుడు ఆ పంటలు సాగు చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎద్దు, ఎవుసం లేదని, అందుకే వారికి ఏ ఇబ్బంది లేదని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర రైతులకు సంబంధించిన అంశంపై సలాహా ఇచ్చిన రిటైర్డ్ ఇంజినీర్లతోపాటు ఇంజినీర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని, అవసరమైతే కన్నెపల్లి వద్ద నీటి ఎత్తిపోతలకు ఉన్న పరిస్థితులను స్వయం గా పరిశీలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కమ్ముకుంటున్న కరువును అధిగమించేందుకు మంత్రి ఉత్తమ్ కృషి చేయాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి, శీలం ప్రవీణ్ కుమార్, గాజుల రాజేందర్, కళ్లేపల్లి దుర్గయ్య, నేహాల్, ముంజాల రఘువీర్ గౌడ్, శ్రీ రాముల గంగాధర్, కౌన్సిలర్స్ ప్రదీప్ , హరీశ్, సర్పంచులు పొట్టవతిని సతీశ్ కుమార్, శీలం సురేందర్, పోనిశెట్టి మ హేశ్, నల్ల స్వామిరెడ్డి, నాయకులు ధర రమేశ్ బాబు, రూప రఘు, రియాజ్ బాయ్, అబ్దుల్ బారి, చెట్పల్లి సుధాకర్, గుండా మధు, అభిరామ్, తదితరులు పాల్గొన్నారు.