గజ్వేల్‌లోని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. పరిపాలన చేతకాకనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం అపహాస్యమైందని ఆవేదనవ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామనే గర్వంతోనే వివేకం, విచక్షణ కోల్పోయి రాక్షసుల్లా ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. గోడలపై బలవంతంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా, తమ వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘డైవర్షన్ పాలిటిక్స్’కు తెరలేకపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిపాలన చేతగాకనే దాడులు
కాంగ్రెస్‌కు పరిపాలన చేతగాకనే దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్నది. గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హేయమైన చర్య. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నది. అధికారంలో ఉన్నామనే గర్వంతో కాంగ్రెస్ నాయకులు వివేకం, విచక్షణ కోల్పోయి రాక్షసుల్లా ప్రవరిస్తున్నారు. దాడులు చేయడం, అవినీతికి పాల్పడడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనం.
ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజా సంఘాలు, మీడియా సంస్థలపై దాడులు చేయడం సిగ్గు చేటు. హామీలు నెరవేర్చకుండా, తమ వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘డైవర్షన్ పాలిటిక్స్’కు తెరలేపోతున్నది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అందిస్తామంటూనే రాక్షస పాలనను చేస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి ఇతర రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలి.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
సిగ్గుమాలిన చర్య
గజ్వేల్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, బలవంతంగా గోడలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావిస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడి క్యాంప్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడడం కాంగ్రెస్ పార్టీ అహంకారం, అసహనం, రాజకీయ దివాళాకోరుకు నిదర్శనం. క్యాతన్‌పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని జీర్ణించుకోలేక నీచ రాజకీయాలకు దిగడం సిగ్గుమాలిన చర్య.
రేవంత్‌రెడ్డి ఎవరు? ఆయన ఫొటోను బలవంతంగా ప్రతి గోడపై పెట్టేంత గొప్ప వ్యక్తిత్వమా?. ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రభుత్వ నివాసాల్లో నరేంద్రమోదీ ఫొటోలు పెట్టారా?. క్యాంప్ కార్యాలయాలు ప్రజాప్రతినిధుల నివాసాలే గానీ, సీఎం ఫొటోలు పెట్టాలన్న నిబంధన లేదు. ఎంఐఎం, బీజేపీ కేంద్ర మంత్రులకు కేటాయించిన కార్యాలయాల్లో రేవంత్‌రెడ్డి ఫొటోలు పెట్టారా?. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన రాజకీయ దౌర్జన్యం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతాం. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాలి గానీ, గోడలపై ఫొటోలు కాదు.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద జరిగిన దాడి యావత్ తెలంగాణ మీద జరిగినట్లుగా భావిస్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి గూండాయిజం పాలనను ప్రోత్సహిస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఇదేనా మీరు ప్రజలకు అందిస్తున్న ప్రజాపాలన. శాంతిభద్రతలు లోపభూయిష్టంగా మారాయి. గజ్వేల్ కార్యాలయంపై జరిగిన దాడి ఇందుకు నిదర్శనం. ఇలాంటి అరాచక పాలనను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక, వాటిని డైవర్షన్ చేసేందుకు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ర్టాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే సహించబోం.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి