రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో నేతన్నల బతుకులు ఆగమవుతున్నాయని బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది పొద్దు నిరంతరం పనికల్పిస్తామని చెప్పిన నేతలు పత్తాలేకుండా పోయారంటూ ధ్వజమెత్తారు. ఏదో పని కల్పిస్తున్నట్టు చీరెల ఆర్డర్లు ఇచ్చి కూలీ రేట్లు నిర్ణయించక పోవడం నేతన్నలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
ప్రభుత్వం ఇస్తున్న చీరెల తయారీకి కూలీ రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు సోమవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో 24 గంటల నిరాహార దీక్ష చేయగా, ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మద్దతు తెలిపారు. శిబిరంలో కూర్చున్న నేతకార్మికులు, సీఐటీయూ నాయకులకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. 2014కు మందు కూడా కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పెను సంక్షోభంలో కూరుకుపోయి పెద్ద ఎత్తున నేత కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యలకు గురయ్యారని గుర్తు చేశారు.
మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతన్నల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, బతుకమ్మ చీరెలతో బతుకులకు భరోసా కల్పించారని కొనియాడారు. నెలకు రూ.20 వేల కూలి వచ్చేలా కేసీఆర్ ప్రభుత్వం రూ.కోట్లలో ఆర్డర్లు ఇచ్చి చేయూత నిచ్చిందని చెప్పారు. పెట్టుబడి దారులను ప్రోత్సహించే విధంగా యారన్ సబ్సిడీ ఇచ్చి, పదిశాతం కార్మికులకే చెల్లించిందన్నారు.
నేతన్నకు బీమా, త్రిఫ్ట్, 50 ఏళ్లకే పింఛన్లు ఇలా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి నేతన్నల కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. పదేళ్ల పాటు సంతోషంగా గడిపిన నేతన్నల కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చీరెల తయారీ ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వం కార్మికుల కూలి నిర్ణయించకుండా ఆసాములకు, యజమానులకు వదిలిపెట్టి ఇద్దరి మధ్య సమస్యను సృష్టించిందని ధ్వజమెత్తారు.
సాంచాలు సిరిసిల్లలో ఉంటే యారన్ బ్యాంకు వేములవాడలో పెట్టి ఎవరిని ఉద్దరించడానికంటూ మండి పడ్డారు. సర్కారు ఇచ్చే నూలుకు రెట్టింపు చార్జీలు రవాణాకే ఖర్చవుతున్నాయని, ఇదా మీ ప్రభుత్వ పనితమనంటూ ధ్వజమెత్తారు. నేతన్నల సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మె, దీక్షలను విరమింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మాజీ కౌన్సిలర్లు దార్ల సందీప్, అడ్డగట్ల మురళి, అన్నారపు శ్రీనివాస్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, కొండ శంకర్, సీఐటీయూ నాయకులు మూషం రమేశ్, కోడం రమణ, మరమగ్గాల కార్మికులు పాల్గొన్నారు.
కూలీ రేట్ల కోసం నేతన్న 24గంటల దీక్ష
ప్రభుత్వం ఇస్తున్న చీరెల తయారీకి కూలీ రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల నేత కార్మికులు సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. నిరవధిక దీక్ష సోమవారం ఏడో రోజుకు చేరగా, స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో 24 గంటల నేతన్న దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ప్రారంభించగా, బీఆర్ఎస్, సీపీఎం పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. కూలీ రేట్ల కోసం ఏడు రోజలుగా సమ్మె చేస్తున్నా అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
తమ సమస్యను పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. దీక్షా శిబిరంలో పవర్లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, వార్పిన్ కార్మిక సంఘం అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, వైపని అసోసియేషన్ అధ్యక్షుడు కుమ్మరికుంట్ల కిషన్, నక్కదేవదాస్, ఉడుత రవి, ఎలిగేటి దేవదాస్, బూట్ల వెంకటేశ్వర్లు, మేకల బాలరాజు, అవదూత హరిదాస్, బాస శ్రీధర్, కస్తూరి సతీశ్, గుండు రమేశ్ పాల్గొన్నారు.