సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 11 : అమలుగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలే త్వరలో బొంద పెడతారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హెచ్చరించారు. చార్ సౌ బీస్ హామీలతో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడమే రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి అన్నదమ్ములు, కుటుంబ ప్రయోజనంపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో చేసిన సర్వేకు సంబంధించిన సంపూర్ణ వివరాలతో సమగ్ర కుటుంబ జాబితాను ఆన్లైన్లో పెట్టారని గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డి చేసిన కులగణన సర్వేతో సామాజికవర్గాలకు తాకులాటలు పెట్టించారని విమర్శించారు. పదేండ్లలో కనీసం 3 శాతం పెరగాల్సిన బీసీ జనాభాను కావాలనే తగ్గించి చూపారని, తన సామాజికర్గమైన అగ్రవర్ణాల జనాభాను పెరిగినట్టు చూపారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో లాభపడాలన్న ఉద్దేశంతోనే ఈ మోసానికి కుట్ర లేపారని ధ్వజమెత్తారు. తెలంగాణపై నిత్యం విషం చిమ్మే మీడియా సంస్థల ద్వారా సామాజికవర్గాల మధ్య కొట్లాటలు పెట్టించారని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ దేశంలో అంతరించిపోతున్న పార్టీ అని ఎద్దేవా చేశారు. వట్టిపోయి, వాడిపోయిన కూరగాయల్లాగా అధికారంలోకి వచ్చిన నాయకులు సైతం బీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమ కాలంలో తాము అన్ని రకాల ఆటుపోట్లను ఎదుర్కొన్నామని చెప్పారు.
కేకే మహేందర్‌రెడ్డికి ఉద్యమ ప్రస్థానమే తెలియదని, ఓ అధికారిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టినంత మాత్రాన బీఆర్ఎస్ను నష్టపరుస్తున్నామని అనుకుంటే వారి భ్రమేనని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ వద్దకు వచ్చి పనుల్లో సాయం తీసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే అహంకారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ, బీసీలకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ అని, ఆ పార్టీ బీసీలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు. కేంద్రంలో నాటి నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లుకు ఆమోదం తెలుపలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు. అన్ని రంగాలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. బీసీల అభ్యున్నతికి పాటుపడింది బీఆర్ఎస్ మాత్రమేనని కొనియాడారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గజభీంకార్ రాజన్న, బండ నర్సయ్యయాదవ్, కోడి అంతయ్య, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, పడిగెల రాజు, దిడ్డి రాజు, కొమిరిశెట్టి లక్ష్మణ్, పాపగారి వెంకటస్వామిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.