జూలపల్లి, ఏప్రిల్ 12: ‘బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి ప్రతి ఊరు నుంచి కదలిరావాలని, బహిరంగ సభను సక్సెస్ చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పార్టీ ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో 27న నిర్వహించనున్న రజతోత్సవ వేడుకల సందర్భంగా శనివారం జూలపల్లిలోని ‘గోల్డెన్ ఫంక్షన్ హాల్’లో ఛలో వరంగల్ వాల్ పోస్టర్లను విడుదల చేసి, సన్నాహాక సమావేశంలో కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేసి మాట్లాడారు.
కార్యకర్తలు, రైతులు, అభిమానులు, మాజీ ప్రజాప్రతినిధులు తెలంగాణ ఆత్మగౌరవం కోసం సభకు తరలివెళ్లాలని పేర్కొన్నారు. అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం పనితీరును చూస్తున్న ప్రజలు ఛీకొడుతున్నారనీ, అప్పటి బీఆర్ఎస్ పాలనే బాగుందని విశ్వసిస్తున్నారని తెలిపారు. పోరాడి రాష్ర్టాన్ని తెచ్చి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించిన కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
ప్రభుత్వ వైఫల్యాలు ఎప్పటికప్పుడూ ఎండగట్టి ప్రజల పక్షాన నిలబడాలని, త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కంది చొక్కారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు తమ్మడవేని మల్లేశం, కత్తెర్ల శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యుడు లాల్ మహ్మద్, గ్రామ కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.