రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ‘ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నోరు జాగ్రత్త! నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హితవు పలికారు. మంత్రులుగా పదేళ్లు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన కేటీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కుట్రలు, కుతంత్రాలు, నిరాధార ఆరోపణలు చేస్తే చైతన్య వంతులైన ప్రజలే సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలు, రైతులకు గోదావరి జలాలు, సరిపడా కరెంటు, ఎరువులు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్‌దని గుర్తు చేశారు. రాష్ర్టాన్ని గౌరవ ప్రదమైన జీడీపీలో నిలబెట్టారని ప్రశంసించారు. అలాంటి ప్రభుత్వంలో పనిచేసిన కేటీఆర్‌ను విమర్శిస్తే ‘ఖబడ్దార్’ అంటూ మేడిపల్లి సత్యంను హెచ్చరించారు.
కనీస అవసరాలు తీర్చలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీవు భాగస్వామ్యం అయినందుకు సిగ్గుపడాలని దెప్పి పొడిచారు. మీ అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. చేతికర్రలు, చెప్పులు లైన్లోపెట్టి బస్తబస్తకూ నిలబడే దుస్థితిని తీసుకొచ్చిన దరిద్రపు ప్రభుత్వమని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ములేక, రోడ్లపైన తిరగలేని పరిస్థితి మీకొచ్చిందని విమర్శించారు. మూడు సార్లు ఓడిపోయి అయ్యోపాపం అని ప్రజలు గెలిపించిన సంగతి మరిచి పోవద్దని హితవు పలికారు.
నీలా మూడు సార్లు కేటీఆర్ ఓడిపోలేదని చెప్పారు. పార్టీలు మారిన చరిత్ర నీదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. గౌరవ ప్రదమైన వ్యక్తి కేటీఆర్ ఏనాడు నీలా పార్టీలు మారలేదని విమర్శించారు. గాయత్రీ పంపుహౌస్ నీ నియోజకవర్గంలో ఉన్నంత మాత్రాన నీవు సిపాయికాదని, పంపుహౌస్ రేవంత్‌రెడ్డి అయ్యా జాగిరా..? అని నిలదీశారు. కేసీఆర్ నిర్మించిన గాయత్రీ పంపుహౌస్ నుంచి బరాబర్ మిడ్‌మానేరుకు నీళ్లు వస్తాయని, అంతగిరి, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్‌తో పాటు హైదరాబాద్‌కు, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వెళ్తాయని చెప్పారు. ఇదొక వ్యవస్థ అని స్పష్టం చేశారు.
మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులున్న ప్రాంతాల ప్రజలు ఇవి మావే అనుకుంటే రాష్ట్ర వ్యవస్థనే ఎక్కడికక్కడ ఆగిపోతుందన్నారు. నీటి పాజెక్టులపై కనీస పరిజ్ఞానం లేని సత్యం నీకు కేటీఆర్‌పై విమర్శలు చేసే స్థాయి ఉన్నదా..? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి రాష్ట్రం మీద పడి డెకాయిట్లు, బందిపోటు దొంగల్లా దోచుకుంటున్నారని విమర్శించారు. అలాంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నందుక నీవు సిగ్గుపడాలని దెప్పిపొడిచారు.
మూడేళ్లు ఓపిక పడితే ప్రజలు ఎవరిని పండపెట్టి తొక్కుతరో.. తెలుస్తుందన్నారు. నీపక్కనున్న పోలీసులే రేపు ఫాగల్గాళ్లను బరాబర్ తొక్కి జైల్లో పెట్టడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, పట్టణ ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్, తంగళ్లపల్లి మండల శాఖ అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, నాయకులు కుంబాల మల్లారెడ్డి, అందె సుభాష్, గాజుల బాలయ్య, గడీల సురేశ్, సురేశ్ నాయక్, గడ్డం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.