మానకొండూర్ రూరల్, జులై 21: కాంగ్రెస్ పనైపోయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు లేకనే చేరికల పర్వానికి తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. సదాశివపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో పార్టీ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మానకొండూర్ మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్తో కలిసి ముఖ్యఅతిథిగా వచ్చి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మెరుగైన పాలన అందించామని, 70 ఏళ్ల కాలంలో చేయని అభివృద్ధిని పదేండ్లలోనే వందశాతం చేసి చూపించామని చెప్పారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడంతోనే ఓడిపోయామని గుర్తు చేశారు.
నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా పాకడంతోనే దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, ఆరు గ్యారెంటీల ఆశ చూపెట్టి నిండా ముంచిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వస్తున్నదని, మళ్లీ సీఎంగా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని వివరించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాడు చెరువుల్లో మట్టి తీసి బాగు చేయడంతోనే నేడు సాగు, తాగు నీరుకు ఢోకా లేదని, అలా ఎవరైనా, ఏనాడైనా తట్టెడు మన్ను తీశారా..? అనే విషయాన్ని, మనం అభివృద్ధి చేసిన విషయాలను గ్రూపుల్లో బరాబర్ చర్చించాలని సూచించారు.
నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 52 వేల మంది దరఖాస్తులు చేసుకుంటే 650 మందికి మాత్రమే ఇచ్చారన్నారు. మంజూరు చేసిన ఇండ్లకు సైతం మొదటి, రెండో దఫా డబ్బులు మాత్రమే పడతాయని, అవి కూడా కేంద్రం ఇచ్చిన పైసలేనని, రాష్ట్ర సర్కారు ఎప్పటిలాగే ధోకా చేస్తుందని మండిపడ్డారు. పోయిన ఎన్నికల్లో తాను ఓడినా ప్రజల సపోర్ట్ మరవలేనిదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ప్రజలకోసమేనని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సర్పంచ్, ఎంపీటీసీలు గెలుచుకొని, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నించాలని సూచించారు.
నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి స్థానిక ఎన్నికల్లో ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే బీ ఫారం అందజేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు గెలిస్తే ఊళ్లకు కాపలాదారులుగా పనిచేస్తారని, ప్రజలు దీవించాలని కోరారు. ఇక్కడ శంకరపట్నం మండలాధ్యక్షుడు గంట మహిపాల్, మాజీ జడ్పీటీసీ ఎడ్ల సుగుణాకర్, సొసైటీ తాజా, మాజీ చైర్మన్లు నల్ల గోవింద రెడ్డి, ముద్దసాని ప్రదీప్ రెడ్డి, సీనియర్ నాయకులు గడ్డం నాగరాజు, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రామంచ గోపాల్ రెడ్డి, శాతరాజు యాదగిరి, బీఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు బొం గొని రేణుక, నాయకులు శ్రీనివాస్, కిరణ్ పాల్గొన్నారు.
దేశంలో ప్రధాని మోదీ హవా తగ్గింది. ఇక్కడ బండి సంజయ్ సైతం కేంద్రమంత్రిగా చేసిందేమీ లేదు. వాళ్లు ఎప్పుడు ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. ప్రజలను రెచ్చగొట్టడమే వారికి తెలుసు. కాంగ్రెస్ పాలనలో ఫెయిల్ అయింది. ఒక్క పనీ చేస్తలేదు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వాట్సాప్ గ్రూప్ల్లో పోస్టులు పెట్టాలి. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అభ్యర్థుల కోసం కష్టపడాలి.
– జీవీఆర్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కరీంనగర్