GODHAVARIKHANI | కోల్ సిటీ , మార్చి 31: వీహెస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ నాయకుడు, ఎన్నారై వ్యాల హరీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ ఫౌండేషన్ రామగుండం టీం సభ్యులు పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టి అభిమానం చాటుకున్నారు. ఈ మేరకు నగరంలోని పలు దేవాలయాల్లో హరీష్ రెడ్డి పేరిట అర్చన చేయించారు.
అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు దివంగత అబ్బోజు రాంబాబు కుమారుడి చదువు నిమిత్తం ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రూ.30వేలు కళాశాల ఫీజును ఆర్థిక సాయంగా మాజీ ఎంపీపీ వ్యాల అనసూర్య రాంరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ప్రతి ఏటా రూ.80వేల కళాశాల ఫీజు సాయం చేస్తున్నందుకు అతని కుమారుడు శ్రీరామ్ కృతజ్ఞతలు తెలిపారు. తిలక్ నగర్ కు చెందిన క్యాన్సర్ బాధితుడికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.7 వేలు, మానసిక స్థితి సరిగా లేని యువకుడికి 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు.
అలాగే స్థానిక ఆర్బీఓఏ క్లబ్లో నిరుపేద కుటుంబాలకు రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. ప్రభుత్వ దవాఖానలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఆనాథాశ్రమంలో అన్నదానం చేసి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, వీహెచ్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.