Koppula Eswar | ధర్మారం, మార్చి3: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ధర్మపురి నియోజకవర్గంలో యాసంగిలో సాగుచేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న లింక్ కాల్వ అర్థంతరంగా నిలిచిపోయిందన్నారు. ధర్మారం, ఎండపల్లి, వెల్గటూరు మండలాలలోని కాల్వ చివరి గ్రామాల రైతులు, పార్టీ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. రిజర్వాయర్ నుంచి ప్రారంభమైన లింక్ కాలువ తూముతోపాటు కాలువను ఆయన పరిశీలించారు.
లింక్ కాలువ వద్ద సోమవారం ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ సహకారంతో మూడేండ్ల క్రితం మల్లాపూర్ నుంచి వెల్గటూరు మండల చివరి గ్రామాలకు సాగునీటిని సరఫరా చేయడానికి రూ.13 కోట్లుమంజూరు చేయించామని తెలిపారు. ఈ నిధులతో నంది రిజర్వాయర్ నుంచి 2.5 కిమీ దూరం వరకూ లింకు కాలువ పనులు ప్రారంభించామని, దాదాపు 90 శాతం పూర్తయిందన్నారు. మిగతా కేవలం 10 శాతం పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయించడం లేదని విమర్శించారు.
ఈ కాలువ నిర్మాణం పూర్తికి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రద్ధ వహించడం లేదని ఈశ్వర్ ఆరోపించారు. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే ధర్మారం మండల కేంద్రంతో పాటు ఎండపల్లి, వెల్గటూరు మండలాల్లో చివరి ఆయకట్టు ప్రాంతానికి పూర్తిస్థాయిలో నీరందితే పంటలు సస్యశ్యామలం అవుతాయని వివరించారు. మల్లాపూర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చే ఎస్సారెస్పీ డి 83/బీ కాలువ నుంచి వెల్గటూరు మండలంలోని చివరి గ్రామాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. స్థానిక రైతుల విజ్ఞప్తి మేరకు సాగు నీటిని అందించడానికి ఈ లింకు కాలువ నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కొద్దిపాటి కాలువ నిర్మాణం పూర్తికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఎందుకు శ్రద్ధ వహించడం లేదని ప్రశ్నించారు.
ఈ లింకు కాలువ చేపట్టవద్దని గతంలోని ఓసారి లక్ష్మణ్ కుమార్ ప్రజావాణిలో కలెక్టర్కుఫిర్యాదు చేశాడని ఆ దురుద్దేశంతోనే ఈ కాలువ నిర్మాణం పూర్తి చేయడంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని ఈశ్వర్ ధ్వజమెత్తారు. లక్ష్మణ్ కుమార్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ లింక్ కాలువ నిర్మాణం తక్షణమే పూర్తి చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. అలాగే సారంగాపూర్ మండలం రోళ్ల వాగు ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తే.. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నాడని లక్ష్మణ్ కుమార్ ఎదురుదాడి చేశాడని ఈశ్వర్ వివరించారు. రోళ్ల వాగు ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం లక్ష్మణ్ కుమార్‌కు అసలే లేదన్నారు. దీనిపై ఇప్పటివరకు జిల్లా కలెక్టర్‌తో దాని పరిస్థితిపై సమీక్ష కూడా నిర్వహించే లేదని మండిపడ్డారు. నీటి ప్రాజెక్టులను, కాలువ నిర్మాణాలను పూర్తి చేయని లక్ష్మణ్ కుమార్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని కొప్పుల ఈశ్వర్ హితవు పలికారు. తనను విమర్శించడానికి లక్ష్మణ్ కుమార్‌కు నైతిక అర్హత లేదన్నారు.
కాంగ్రెస్ 15 నెలల కాలంలో ధర్మపురిలోని గ్రామాలలో చేసిన అభివృద్ధి ఏమిటో లక్ష్మణ్ కుమార్ చెప్పాలని ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్‌విప్‌గా, రాష్ట్ర మంత్రిగా ఎంతో అభివృద్ధి చేశానని, లక్ష్మణ్ కుమార్ చేసిన అభివృద్ధి మార్క్ ఏమిటో రుజువు చేసుకోవాలని ఈశ్వర్ సవాల్ చేశారు. అభివృద్ధిపై చర్చకు రావాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. రైతులకు సాగునీరు ఇవ్వని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన విమర్శించారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడం, రైతు భరోసా అందించకపోవడం, యాసంగి పంటలకు సాగునీటిని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈశ్వర్ ఆరోపించారు.