కార్పొరేషన్, అక్టోబర్ 10 : ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ అన్ని వర్గాలకూ బాకీ పడిందని, ఆ బాకీలపై ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌లో గాంధీ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం అదే ఏరియాలో ఇంటింటికీ కాంగ్రెస్ బాకీకార్డులను పంపిణీ చేసి, ఆ పార్టీ మోసాలపై వివరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ భరోసా కార్డు అందించి ప్రజలను మభ్యపెట్టిందని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇంత వరకు అమలు చేయలేదని విమర్శించారు.
ఈ ప్రభుత్వం ఇరువై రెండు నెలలుగా ఉద్దెర ఖాతా నడిపిస్తున్నదని, ప్రజలందరికీ బాకీ ఉందని చెప్పారు. కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చి, ఆ పార్టీ నాయకులను నిలదీసేలా బీఆర్ఎస్ పనిచేస్తున్నదని చెప్పారు. అందుకే ఇంటింటికీ బాకీ కార్డులు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. బీసీలకు కూడా కాంగ్రెస్ అతి పెద్ద బాకీ ఉందని, ఏటా 20వేల కోట్లు బడ్జెట్లో పెడుతామని చెప్పి ఇప్పటి వరకు కేటాయించలేదని విమర్శించారు. వీటన్నింటిపై ప్రజలకు అవగహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ 22 నెలల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రతి ఆడబిడ్డకూ నెలకు 2500 ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు 55 వేలకు వరకు బాకీ పడ్డది. వృద్ధులకు నాలుగు వేల ఫించన్ ఇస్తామని చెప్పి, 44వేల బాకీ పడ్డది. దివ్యాంగులకు నెలకు ఆరు వేలు ఇస్తామని 44 వేలు బాకీ పడ్డది. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వడం లేదు? విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల బాకీ ఉన్నది. నిరుద్యోగ భృతి 22 నెలలకు కలిపి 88 వేల బాకీ పడ్డది. విద్యా భరోసా కింద 5 లక్షలు, రైతులకు భరోసా కింద 76 వేలు, రుణమాఫీ కింద 2 లక్షలు బాకీ ఉన్నది. ఈ లెక్కన ప్రతి వ్యక్తికీ లక్ష నుంచి లక్షన్నర వరకు ప్రభుత్వం బాకీ పడ్డది. ఈ ప్రభుత్వం ఎప్పటిలోగా ప్రజలకు బాకీ తీరుస్తుందో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి.
– గంగుల కమలాకర్