మానకొండూర్ రూరల్, మార్చి 13: రాబోయే రోజుల్లో మార్చురికీ పోయేదీ, స్ట్రెచర్ ఎక్కేదీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఎద్దేవా చేశారు. దేశంలో బలహీనమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని, ఆయన ఎప్పుడేం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి మున్ముందు కరీంనగర్లో ఏ సభ పెట్టినా అడ్డుకుంటామని హెచ్చరించారు. మానకొండూర్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయిందని, ఆ పార్టీ కంటే బీఆర్ఎస్ చాలా బలంగా ఉందన్నారు.
రేవంత్ రెడ్డిని ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆయన ఏదైనా సభలో, సమావేశంలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అక్కడి నుంచి వెళ్లి పోతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి దుర్యోధనుడిగా వ్యవహరిస్తున్నారని, తుపాకీ రాముడు అనే బిరుదును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. రేవంత్రెడ్డి గడిచిన 14 నెలల్లో కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీని తిట్టుడు తప్ప రాష్ర్టానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. చొప్పదండి మండలంలో సాగునీటి కోసం రైతులు ధర్నా చేస్తుంటే, మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల మధు, మానకొండూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.