మానకొండూర్, జూలై 3 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావుకు అవగాహన లేదని, లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇంట్లో బోరు నుంచి వాటర్‌ను ట్యాంక్‌పైకి ఎక్కించడం అనుకుంటున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఎద్దేవా చేశారు. టీఎంసీ, ఆనకట్ట, గ్రావిటీ కెనాల్, లిఫ్ట్ ఇరిగేషన్ వంటి పదాలకు కూడా సరిగా అర్థం తెలియకుండా మాట్లాడవద్దని, ప్రాజెక్ట్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై, మాజీ మంత్రి హరీశ్‌రావుపై విజయరమణారావు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరంలో 1531 గ్రావిటీ కాలువలు, 20 పంప్‌హౌస్‌లు, 20 రిజర్వాయర్లు, 1832 కిలోమీటర్ల నీటి సరఫరా, 240 టీఎంసీల సామర్థ్యం, 204 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయని వివరించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, లోయర్‌మానేరు, అప్పర్ మానేరు, ఆనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, సింగూర్, నిజాంసాగర్ నుంచి ఎస్సారెస్పీ వరకు అనుసంధానం చేశారన్నారు.
ఇవన్నీ తెలియకుండా దుష్ప్రచారం చేస్తూ మాట్లాడడం అతని అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లకు మరమ్మతు చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకులు శాతరాజు యాదగిరి, రామంచ గోపాల్‌రెడ్డి, ఆడప శ్రీనివాస్, గుర్రం కిరణ్‌గౌడ్, బోడ రాజశేఖర్, ఉండింటి అనిల్, దండబోయిన శేఖర్, బొల్లం అనిల్ పాల్గొన్నారు.