హుజూరాబాద్/జమ్మికుంట, జూన్ 12: తెలంగాణ బాగుపడాలంటే ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ మళ్లీ రావాలి’ అని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్ఘాటించారు. అందుకు కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎవరూ అధైర్యపడొద్దని, కేసులకు బెదరవద్దని సూచించారు. కష్టకాలంలో పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసానిచ్చారు.
జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సభ్వత్వ నమోదు, సర్ నమోదు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదంతా డిజిటలైజేషన్ ప్రకారం సాగుతుందని, కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును ఎండగట్టాలని, రేవంత్ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు.

సీఎం రేవంత్‌రెడ్డి పాలన అంతా అబద్ధాలమీదనే నడుస్తున్నదని, ఆయన ప్రజలను అరిగోస పెడుతున్న హిట్లర్ అని విమర్శించారు. విలాసాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఆయనకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రం పైసల్లేవని మండిపడ్డారు. పైగా కేసీఆర్ పథకాలను ఎగ్గొడుతున్నారని ఆగ్రహించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు 24గంటల విద్యుత్ సరఫరా ఉండేదని, ఇప్పుడు ఉచిత కరెంటుకు మంగళం పాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, రైతు డిస్కం తెచ్చి 6గంటలకే పరిమితం చేసేలా చూస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పేరిట రైతులకు రూ.74వేల కోట్లు ఇస్తే.. కాంగ్రెస్ రెండున్నరేళ్లలో రూ.20వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిందన్నారు.
ఐదు నెలలుగా రైతు బీమా ఎల్ఐసీ ప్రీమియం కట్టడం లేదని మండిపడ్డారు. ఇక ఎరువులు అందించకుండా.. పంటలు కొనకుండా.. బోనస్ ఇవ్వకుండా రైతులను అరిగోస పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న సాక్షిగా హామీలు అమలు చేస్తానని మాట తప్పాడని విమర్శించారు. ‘నీ హిట్లర్ పాలన అంతం చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నార’ని, రేవంత్‌రెడ్డిని తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేవంత్ డిపాజిట్ గల్లంతేనని, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ఎన్నికలు ఏవైనా హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండేనని స్పష్టం చేశారు. నియోజకవర్గంపై కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమని, అందుకు ఇక్కడి నుంచే రైతు బంధు, దళిత బంధు పథకాలను ప్రారంభించిన విషయాలను గుర్తు చేశారు.
ప్రభుత్వంపై కొట్లాడుతున్న కౌశిక్‌పై కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. డంప్ యార్డు తరలించేదాకా ఉద్యమిస్తామని, అసెంబ్లీలో నినదిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హుజూరాబాద్‌కు ప్రత్యేక ప్యాకేజీని అందిస్తామని, గొప్పగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమలాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పలువురు పార్టీలో చేరగా, వారికి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, బండ శ్రీనివాస్, పింగిళి రమేశ్, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అందాల పోటీలకుంటయ్.. పథకాలకు పైసలుండయ్
మాజీ మంత్రి హరీశ్‌రావు
మా రైతులకు రైతు బంధు ఇయ్యటానికి డబ్బులుండవ్. మా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులుండవ్. రూ.2వేల పింఛన్ రూ.4వేలు ఇస్తానని అబద్ధాలాడిండు. మహిళలకు రూ.2500 ఇస్తనని మోసం చేసిండు. వీటికి డబ్బులుండవ్. మరి లేవా.. అంటే ఉన్నయ్. ఒక్క రేవంత్‌రెడ్డికి మాత్రమే ఉన్నయ్. అవి ఎక్కడ ఖర్చు పెట్టిండు అంటే.. జూబ్లీహిల్స్‌లో పెద్ద ప్యాలెస్ ఉన్నా.. అది చాలదని రూ.వందల కోట్లు పెట్టి క్యాంపాఫీసు కట్టిండు. ఫ్యూచర్ సిటీలో మరోటి కడుతున్నడు. ఇప్పుడున్న హెలీక్యాప్టర్ సరిపోదని రూ.5కోట్లు పెట్టి కొత్తది కొంటాడట. మెస్సీతో ఫుట్‌బాల్ ఆడటానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు వందల కోట్లు పెట్టిండు. అందాల పోటీలకుంటయ్.. ఫుట్‌బాల్ సోకు ఆటకుంటయ్.. ఎయిర్ బస్సు హెలీక్యాప్టర్కుంటయ్.. ఇతర రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటయ్.. కానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఉండయ్. రైతు బీమాకు ఉండయ్. మా అవ్వ, తాతలకు పింఛన్లకు ఉండయ్.