‘సార్ మీరే మాధైర్యం. మీతోనే మేముంటం’ అంటూ రైతు బాంధవుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లా రైతులు తేల్చిచెప్పారు. నీళ్లు లేక ఎండిన పంటలను పరిశీలించేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఎర్రటెండలో ఉమ్మడి జిల్లాకు రాగా, ఉద్వేగానికి లోనయ్యారు. పదేళ్లలో తమకు ఏ కష్టం రాలేదని, నీళ్లు, కరెంట్‌కు గోసపడ లేదని, రైతుబంధు ఇచ్చి పెట్టుబడికి రంది లేకుండా చేశారని గుర్తు చేశారు.
కానీ, ఇప్పుడు నీళ్లు లేక పంటలు ఎండిపోయి తమ గోడు వెల్లబోసుకున్నారు. రైతుల కష్టాలను చూసి చలించిపోయిన కేసీఆర్, మీకు అండగా ఉంటానని, అధైర్య పడొద్దని భరోసా నిచ్చారు. రైతుల బతుకులు ఆగం చేస్తున్న ప్రభుత్వంపై పోరాటం చేద్దామని పిడికిలి బిగించి పిలుపునివ్వగా, ‘మీతోపాటే మేం నడుస్తం’ అంటూ రైతులు నినదించారు.
కరీంనగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు అండగా నిలించేందుకు పొలంబాట పట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శుక్రవారం ఎర్రటి ఎండను లెక్కచేయకుండా కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. పంటలను పరిశీలిస్తూ.. రైతులకు ధైర్యం చెబుతూ ముందుకు సాగిన ఆయనకు దారిపొడవునా.. రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా కరీంనగర్ మండలం మొగ్దుంపూర్‌కు చేరుకున్న ఆయన, రైతులు పొలగాని సంపత్, బండి సంపత్, వేల్పుల నర్సయ్యకు సంబంధించిన ఎండిన పంటలను పరిశీలించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీళ్లు రావడం లేదనే విషయం రైతులు చెప్పగానే.. మరి ఏం చేద్దామని ప్రశ్నించారు. ‘ఈ ప్రభుత్వంపై యుద్ధం చేద్దామా..?’ అని అడిగినప్పుడు.. చేద్దామంటూ రైతులు స్పష్టం చేశారు. ‘కేసీఆర్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం చేసి సిరిసిల్ల జిల్లాకు వెళ్తుండగా, అప్పటికే కార్యకర్తలు, ప్రజలు దారి వెంట జేజేలు పలికారు. అందరికీ అభివాదం చేస్తూ కేసీఆర్ బస్సు ఎక్కుతుండగా.. ‘కేసీఆర్ జిందాబాద్, సీఎం కేసీఆర్’ అంటూ పెద్దఎత్తున నినదించారు.
జగిత్యాల మార్గంలో గంగాధర మీదుగా సిరిసిల్ల వెళ్తూ రామడుగు మండలం వెదిర వద్ద చొప్పదండి నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. వెదిరతోపాటు గంగాధర మండలం కురిక్యాల వద్ద ఎండిన వరి కంకులను చేతబట్టుకుని నిలబడిన రైతులను చూసి కేసీఆర్ బస్సును ఆపించి మాట్లాడారు. ‘ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారు? ఎన్ని ఎకరాల్లో ఎండిపోయాయి’ అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఉద్వేగానికి లోనయ్యారు. ‘సారు మీరు ఉన్న పదేళ్లలో మాకు ఏ కష్టం రాలేదు. నీళ్లిచ్చిన్రు. కరెంట్ ఇచ్చిన్రు.
పెట్టుబడి కోసం రైతు బంధు ఇచ్చిన్రు. కానీ, ఇప్పుడు నారాయణపూర్ రిజర్వాయర్ ఎండిపోయింది. వరద కాలువలో నీళ్లు లేవు. పంటలు ఎండిపోతున్నయి’ అని చెప్పుకున్నారు. ‘మరి యుద్ధం చేద్దామా..?’ అని కేసీఆర్ ప్రశ్నించగా.. ‘చేద్దాం సార్.. ఇక నుంచి మీ వెంటే మేం ఉంటం. మీ వెంటే నడుస్తం’ తేల్చి చెప్పారు. అనంతరం అధినేత బోయినపల్లి శివారులో ఎండిన పంటలను పరిశీలించగా, రైతులు ఉద్వేగానికి లోనయ్యారు. ‘సార్ మేం కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేసినం. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయి. కరెంట్ సరిగ్గా లేదు. మళ్లీ ఆ తప్పు చేయం’ అంటూ స్పష్టం చేశారు. ‘కేసీఆర్ జిందాబాద్’ ‘వద్దురా కాంగ్రెస్ పాలన’ అంటూ నినదించారు. మీ కష్టాల్లో నేను పాలుపంచుకుంటానని కేసీఆర్ అభయమిచ్చారు.
– సీఎం కేసీఆర్‌కు గోడు వెల్లబోసుకున్న రైతు వెంకట్‌రెడ్డి
కొడిమ్యాల, ఏప్రిల్ 5 : ‘సార్.. నేను పదెకరాల వరి పంట సాగు చేస్తే నీళ్లు లేక ఆరెకరాలు పూర్తిగా ఎండింది’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎదుట కొడిమ్యాల మండలంలోని శ్రీరాములపల్లికి చెందిన రైతు చల్లా వెంకట్‌రెడ్డి తన గోడు వెల్లబోసుకున్నాడు. పంటలను పరిశీలించడానికి కేసీఆర్ శుక్రవారం బోయినపల్లికి రాగా, ఆయనతో ఉద్వేగంగా మాట్లాడాడు. తన పొలం పక్కనే ఎల్లంపల్లి గ్రావిటీ కెనాల్ ఉందని, గతంలో అందులో నీళ్లు పారుతుంటే ఒక గుంట ఎండకుండా పొలాన్ని పారించుకున్నానని చెప్పుకున్నాడు. ఈ యాసంగిల నీళ్లు రాకపోవడంతో పొలం ఎండిపోయిందని, పెట్టిన పెట్టుబడి మీద పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
బోయినపల్లిలో పంటలను పరిశీలించి వెళ్తూ.. బోయినపల్లి మండలం శాభాష్‌పల్లి వంతెన వద్ద ఆగారు. నీళ్లు లేక వెలవెల బోతున్న శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయాన్ని పరిశీలించి చలించిపోయారు. నాడు గోదావరి జలాలతో సముద్రాన్ని తలపించేదని, అప్పుడు నిండుకుండలా మారిన జలాశయాన్ని కండ్లారా చూస్తూ తన్మయత్వం చెందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఎడారిలా మారిందని ఆవేదన చెందారు. ఇది సర్కారు వైఫ్యల్యమేనంటూ మండిపడ్డారు.