ఆటపాటలతో సందడి చేయాల్సిన పదేళ్ల బాలుడు మాయదారి రోగం బారినపడ్డాడు. రెండుకిడ్నీలు చెడిపోవడంతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటికే అప్పులు తెచ్చి చికిత్సకు రూ. 8 లక్షలు వెచ్చించిన తల్లిదండ్రులు నిస్సాహాయ స్థితిలో చిక్కుకున్నారు. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని, ఇందుకు రూ. 13 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. నిరుపేదలమైన తాము ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేదని మనోవేదనకు గురవుతున్నారు. దాతలు దయతలచి ఆపన్నహస్తం అందించాలని చేతులు జోడించి దీనంగా అర్థిస్తున్నారు.
శంకరపట్నం, ఫిబవరి 5
శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన వెల్పుగొండ జగన్- లక్ష్మి దంపతులకు కూతురు రక్షిత, కొడుకు అభిలాష్ (10) ఉన్నారు. కొడుకు స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. గత నవంబర్లో అభిలాష్ కాళ్ల నొప్పులు, జ్వరంతో బాధపడగా తల్లిదండ్రులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు బాలుడి రెండు కిడ్నీలు చెడిపోయాయని హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పారు. వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. కొంతకాలంగా చికిత్స అందిస్తున్నా కోలుకోవడంలేదు. బాలుడికి ప్రస్తుతం డయాలిసిస్ చేయిస్తూ బతికిస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే గానీ బాలుడి ప్రాణాలు దక్కవని వైద్యులు చెప్పారు. దీంతో తండ్రి జగన్ తన కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే, శస్త్ర చికిత్సకు సుమారు రూ. 13 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో చేతిలో చిల్లి గవ్వ లేని ఆ నిరుపేద తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఆర్థిక సాయం అందించి తమ కొడుకు ప్రాణాలు కాపాడాలని వేడుకొంటున్నారు. దాతలు సెల్ నంబర్ 9866 800 103కు ఫోన్ పే లేదా యూనియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 0811101 00002096 (ఐఎఫ్ఎస్సీ కోడ్; ఏఎన్డీబీ000811)కు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.