కరీంనగర్ రూరల్, ఆగస్టు 21 : బొమ్మకల్ పరిధిలోని సర్వే నంబర్ 127 స్థలానికి సంబంధించి చల్మెడ లక్ష్మీనరసింహరావుపై ఇటీవల కొంతమంది చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సదరు సర్వేనంబర్ పట్టాదారులు స్పష్టం చేశారు. ఇదంతా ఒక భూ మాఫియా వెనకుండి నడిపిస్తున్నదని, ఆ మేరకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, చల్మెడ నుంచి డబ్బులు వసూలు చేయడానికే చూస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం సర్వేనంబర్ 127 పట్టాదారులు, బాధితులు గూడ అరుణ, గూడ బుచ్చిరాంరెడ్డి, ముత్యాల రాజారెడ్డి, గూడ భాస్కర్ రెడ్డి, గూడ సత్యనారాయణ తదితరులు అదే సర్వేనంబర్ స్థలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సర్వేనంబర్ 127లో గూడ మోహనయ్య అలియాప్ మోహన్‌రెడ్డికి మూడెకరాల మూడు గుంటల స్థలం ఉండేదన్నారు.
మోహన్‌రెడ్డితోపాటు ఆయన వారసులు గూడ రాంరెడ్డి, గూడ లక్ష్మారెడ్డికి సంబంధించిన మొత్తం భూమి మూడెకరాల మూడు గుంటల స్థలాన్ని 1984 నుంచి 2005 వరకు దఫదఫాలుగా 18 డ్యాకుమెంట్స్ ద్వారా విక్రయించారని తెలిపారు. నిజానికి వారికి గుంట స్థలం లేదని చెప్పారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను చూపించారు. వారు తమ స్థలాన్ని ప్లాట్స్‌గా చేసి విక్రయించారని, అయితే నాలా కన్వర్షన్ లేకుండా విక్రయించడం వల్ల అది వ్యవసాయ భూమిగానే ఉండిపోయిందన్నారు. అయితే విక్రయించిన భూమి వివరాలు రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ కాకపోవడం వల్ల 2018లో ధరణిలో తిరిగి ఆన్లైన్లో రావడంతో.. రెవెన్యూ అధికారులను పట్టుకొని గూడ రాంరెడ్డి తన పేరుతో కొత్త పాసుపుస్తకం తీసుకున్నారని తెలిపారు. దాని ఆధారంగా గతంలో విక్రయించిన భూమినే తిరిగి విక్రయించారని చెప్పారు.
ఆన్లైన్లో భూమి ఉండడం.. చేతిలో పాస్ పుస్తకం ఉండడంతో వాటిని చూపించి 2020లో కాసర్ల మంజులకు 20 గుంటలు, గూడ అన్నపూర్ణకు 11 గుంటలు, వెల్పుల పోచ్చయ్యకు 20 గుంటల స్థలాన్ని విక్రయించి మోసానికి పాల్పడ్డాడని ఆరోపించారు. రాంరెడ్డి అమ్మిన స్థలంలో ఇండ్ల నిర్మాణం అయి ఉండడం వల్ల.. పక్కనే ఖాళీగా ఉన్న చల్మెడ లక్ష్మీనరసింహారావుకు చెందిన సర్వే నంబర్ 122లోకి వెళ్లి, ఆ స్థలం తమదే అంటూ కొంతమంది ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. గతంలో కూడా ఇదే పద్ధతిలో తమ భూములలోకి వచ్చి ఇబ్బందులు పెట్టారని వాపోయారు. నిజానికి సర్వే నంబర్ 122లో ఆరోపణలు చేసే వారికి, అలాగే గొడవ చేసే వారికి ఎలాంటి హక్కులు లేవని తేల్చి చెప్పారు. వివిధ పత్రికలకు డబ్బులిచ్చి లేనిపోని వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న వారు.. వారు చూపించే స్థలాన్ని ఎవరూ కొనవద్దని పత్రిక ముఖంగా ప్రజలకు వెల్లడిస్తున్నామని చెప్పారు.
ఈ విషయంలో జోక్యం చేసుకునే పోలీసులు కూడా రికార్డులను పరిశీలించాలని కోరారు. రాంరెడ్డి తన వాటాకు సంబంధించిన భూమిని గతంలోనే విక్రయించారా.. లేదా? తిరిగి రెండోసారి విక్రయించారా.. లేదా? అన్న వివరాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఈసీలను చూస్తే తెలిసిపోతుందన్నారు. రికార్డులు పరిశీలించి.. బ్లాక్‌మెయిలింగ్ పాల్పడుతున్న వారితోపాటు అమ్మిన భూమినే తిరిగి విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంరెడ్డి చేసిన మోసానికి ఆయనే బాధ్యత వహించాలని, అవసరమైతే మోసపోయిన వ్యక్తులు, మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలే తప్పా చల్మెడతోపాటు తమ భూముల్లోకి చొరబడి ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. ఈ సమావేశంలో సర్వే నంబర్ 127 పట్టాదారులు గూడ రాజశేఖర్‌రెడ్డి, ఎం రాజిరెడ్డి, గూడ యాదవ్రెడ్ది, గూడ అనిల్‌రెడ్డి, తోటకిరణ్, ఎం రాం గోపాల్‌రెడ్డి, అబ్దుల్ రజక్, సందీప్, లచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.