ప్రమాద బాధితులు, అత్యవసర రోగులను సకాలంలో దవాఖానలకు తరలించే అంబులెన్సుల నిర్వహణ గాడితప్పుతున్నది. సిరిసిల్ల జిల్లాలో మెయింటనెన్స్ కరువై తరచూ మొరాయిస్తున్నట్టు తెలుస్తున్నది. మరమ్మతులు కరువవడంతో కొన్ని పార్కింగ్‌కే పరిమితమవుతున్నాయి. మరికొన్ని షెడ్డుకు చేరాయి. దీంతో అత్యవసర సమయాల్లో రోగులు ప్రాణాలకు భరోసాలేకుండా పోతున్నది. ఇటీవల ఓ రోగిని ఒక అంబులెన్సు నుంచి మరో అంబులెన్సులోకి మార్చడం నిర్వహణ లోపానికి అద్దం పట్టింది.
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 21 : ఆపద సమయాల్లో రోగులను సకాలంలో దవాఖానలకు చేర్చాలన్న ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరేళ్ల క్రితం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, తంగళ్లపల్లికి ఏడు అంబులెన్సులు అందించారు. సిరిసిల్ల జిల్లా దవాఖానకు అప్పటి ఎంపీ బండి సంజయ్ ఒక అంబులెన్సు ఇచ్చారు. దీంతో ఈ దవాఖానకు రెండు వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలోని 13 మండలాలకు గాను బోయినపల్లి మండలం, వేములవాడ పట్టణం మినహా 11 అంబులెన్సులు ఉన్నాయి. అయితే కొన్నేళ్లు బాగా నడిచిన వాహనాలు ప్రస్తుతం మొరాయిస్తున్నాయి.
సరైన నిర్వహణ లేని కారణంగానే అవి మూలకు చేరుతున్నాయనే విమర్శలున్నాయి. ఇటీవల వీర్నపల్లికి చెందిన 108 మొరాయించడంతో సిరిసిల్లలోని మెకానిక్ షెడ్డుకు చేర్చగా, మిగతా పదింటిలో కొన్ని సతాయిస్తున్నాయి. ప్రతి అంబులెన్స్ ఓడోమీటర్ రీడింగ్ 3 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగితే వాటిని ఉపయోగించకూడదు. కానీ, ఆరేళ్లు గడిచినా సేవల్లో ఉండడంతో ఒక్కో వాహనం 4 లక్షల కిలోమీటర్లు దాటినప్పటికీ.. వాటిని పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదనే విమర్శలు వస్తున్నాయి. అందుకే తరచూ వాహనాలు మొరాయిస్తూ షెడ్డుకు వెళ్తున్నాయి. ఏదేని పంక్చర్, ఇతర మైనర్ రిపేర్ ఉంటే 108 సిబ్బందే ఖర్చులు పెట్టుకుంటున్నట్టు తెలుస్తున్నది. అందుకు సంబంధించిన బిల్లులువ్రిడుదల చేయడం లేదని వాపోతున్నారు.
ఇటీవల ఓ సీరియస్ కండిషన్లో ఉన్న గంభీరావుపేట మండలం గజసింగవరానికి చెందిన పేషెంట్‌ను 108 వాహనంలో తరలిస్తుండగా.. సముద్రలింగాపూర్ చేరుకోగానే మొరాయించడం మొదలు పెట్టింది. పదిర శివారులోకి చేరుకోగానే ముందుకు కదలలేని పరిస్థితిలో ఎల్లారెడ్డిపేటలోని 108 వాహనానికి కాల్ చేసి వాహనం వచ్చే వరకు పేషెంటు బంధువులు భయభ్రాంతులకు గురైనట్లు తెలిసింది. అక్కడి నుంచి మరో వాహనంలో సిరిసిల్ల ఏరియా హాస్పిటల్‌కు తరలించగా, ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్‌కు చెందిన ఓ మహిళా పేషెంట్‌ను తరలించే క్రమంలో ఒక వాహనం మొరాయించడంతో మరో వాహనంలోకి అది కూడా మొరాయించడంతో మూడో వాహనంలోకి మార్చి పేషంట్‌ను జిల్లా హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది.
జిల్లా దవాఖానలో ప్రతి రోజూ 10 నుంచి 15 రిఫరల్ కేసులు ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న నియోనాటల్ అంబులెన్స్ న డుస్తున్నా.. మిగతా రెండు అంబులెన్సులు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. జిల్లా దవాఖాలోఎమెర్జెన్సీ రిఫరల్ రోగులను తరలించేందుకు కొంత డీజిల్ చార్జీలు తీసుకుని కరీంనగర్, సి ద్దిపేట తీసుకెళ్తారు. కానీ, ఆ రెండు వాహనాలను నెలల నుంచి పార్కింగ్‌కే పరిమితం చేశారు. ఏదైనా అత్యవసరమైతే ఇతర మండలాల్లోని 108వాహనాన్నే తీసుకెళ్తున్నారు. దీంతో అదే సమయంలో ఆ మండలంలో వాహనం అవసరం ఏర్పడితే అందుబాటులో లేకుండా పోతుందని స్థానికులు వాపోతున్నారు.
జిల్లా హాస్పిటల్లో ఉన్న అంబులెణ్స్లు పాత మాడల్వి. అందులో సరిపడా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ లేదు. మా వద్ద ఒక నియోనాటల్, రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. అయినా 108లో అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉన్నందున రిఫరల్ కేసులు అందులోనే పంపిస్తున్నాం.