విద్యానగర్, ఫిబ్రవరి 7: క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వందశాతం నయం చేసే అవకాశం ఉందని ప్రతిమా మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బోయినపల్లి మాధవి సూచించారు. ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, చల్మెడ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సహకారంతో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి నగరంలోని టీటీడీ కల్యాణమండపంలో నిర్వహించిన మహిళలకు క్యాన్సర్‌పై ఉచిత అవగాహన, స్క్రీనింగ్ పరీక్షల వైద్య శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నాలుగు రోజులపాటు జరిగిన శిబిరానికి అపూర్వ స్పందన లభించిందని, 846 మంది హాజరయ్యారని చెప్పారు.
ఇందులో పాప్ స్మియర్ పరీక్షకు 486 మంది, థోనోగ్రఫీకి 316 మంది, కాల్పస్కోపికి 63 మంది, అమోగ్రఫీకి 116 మంది వచ్చినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తానని చెప్పారు. వైద్య పరీక్షల రిపోర్టులు ఈ నెల 11న వస్తాయని, అవి రాగానే ఫలితాలను ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చల్మెడ, ప్రతిమా వైద్యులు, సిబ్బంది, బోయినపల్లి మాజీ ఎంపీపీ సత్తినేని భాగ్యలత, తదితరులు పాల్గొన్నారు.