Dharmaram | ధర్మారం, జూలై 28 : చివరి దశలో ఉన్న సర్ ఓటర్ నమోదు ప్రక్రియలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించి అర్హులైన ఓటర్లను నమోదు చేయించాలని సర్, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మూల విజయా రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ధర్మారం మండల కేంద్రంలోని పార్టీ సీనియర్ నాయకుడు పూస్కూరు రామారావు స్వగృహంలో మంగళవారం సర్ ప్రక్రియ పూర్తి చేయించడం, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై బీఎల్ఏ లతో సమన్వయ సమావేశం నిర్వహించగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బీఎల్ఏలతో ప్రత్యేక సమావేశమై సర్ ప్రక్రియలో ఓటర్ల నమోదు వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విజయా రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలతో ఇప్పటికే ధర్మపురి నియోజకవర్గంలో సర్ ప్రక్రియపై పార్టీ బీఎల్ఏలకు అవగాహన కల్పించామని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో బీఎల్ఏల ఆధ్వర్యంలో ఓటర్ నమోదు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిపోయిన ఓటర్లను కూడా ఇంటింటికి వెళ్లి ఫారాలు నింపి బీఎల్వోలకు అందజేసే బాధ్యత తీసుకోవాలని ఆమె సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా ఉండకూడదని, అందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. అర్హులు నష్టపోకుండా చూడాలని ఆమె సూచించారు.
గతంలో ఓటు వేయడంలో ఓటర్లు నిర్లక్ష్యంగా ఉండేవారని ప్రస్తుతం ఓటు విలువ తెలియడంతో ప్రతీ ఒక్కరూ పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు వేయాలనే చైతన్యం బాగా పెరిగిందని ఆమె పేర్కొన్నారు. ఇందుకు ఇటీవల రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధిక శాతం ఓటు నమోదు కావడమే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో ముఖ్యమైనదని పల్లె నుంచి పట్టణం వరకు నిజాయితీగల ప్రజాప్రతినిధులను ఎన్నుకునేది ఓటర్లు అని ఆమె స్పష్టం చేశారు. సర్ ప్రక్రియలో కృషిచేసిన బీఎల్ఏలకు రాబోయే కాలంలో పార్టీలో కృషి చేసినవారికి పదవులలో సముచిత స్థానం ఉంటుందని విజయా రెడ్డి హామీ ఇచ్చారు.
త్వరలో మొదలుకానున్న పార్టీ డిజిటల్ సభ్యత నమోదుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆమెను సన్మానించారు. ఈ సమావేశంలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, ఖిలావనపర్తి సర్పంచ్ మోతే కనకయ్య, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఆర్బీఎస్ జిల్లా మాజీ సభ్యుడు పూస్కురు రామారావు, బీఎల్ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.