చిగురుమామిడి, డిసెంబర్ 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో దేశానికి చాలా ప్రమాదమని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి పరిపాలన కొనసాగాలని, దేశ సంపదను కొల్లగొట్టాలని చూస్తే తమ పార్టీ ఊరుకోబోదని హెచ్చరించారు. మంగళవారం చిగురుమామిడి మండల కేంద్రంలోని ముసు రాజిరెడ్డి స్మారక భవన్లో నవాబుపేట ఉప సర్పంచ్ ఎలగందుల రాజయ్య అధ్యక్షతన జరిగిన సీపీఐ మండల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చి, మాట్లాడారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దేశ సంపద ఎటువైపు పోతున్నదో చెప్పాలన్నారు. బీజేపీ పాలనలో ప్రశ్నించే గొంతుకలు నొకబడుతున్నాయని, అనేక మంది మేధావులను మోడీ ప్రభుత్వం జైల్లో పెడుతున్నదని మండిపడ్డారు. కేంద్రం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ మండలంలో సీపీఐ నిర్మాణం ఉన్నప్పటికీ మరింత బలోపేతం చేసేందుకు నాయకత్వం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 21న అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట భారీ ధర్నాలు చేయాలని, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని 29న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, గూడెం లక్ష్మి, బోయిని అశోక్, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు జీల సంపత్, చాడ శ్రీధర్ రెడ్డి, ఇల్లందుల రాజయ్య, బూడిద సదాశివ, మండల సహాయ కార్యదర్శి అందె చిన్న స్వామి, సర్పంచ్ గోలి బాపురెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బోయిని పటేల్, మండల కన్వీనర్ కాంతాల శ్రీనివాసరెడ్డి, జిల్లా నాయకులు కొంకటి ప్రశాంత్ చట్ల సమ్మయ్య, గ్రామాల సీపీఐ శాఖ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.