Bhagya Reddy Varma | కరీంనగర్ కలెక్టరేట్, మే 22 : దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారని కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను కరీంనగర్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం వద్దగల భాగ్యరెడ్డి వర్మ విగ్రహానికి కలెక్టర్ పమేలా సత్పతి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళల విద్య, అభివృద్ధి కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
మహనీయులను గౌరవించుకోవడంతో పాటు వారి స్పూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి పవన్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.