Bhagirath | గంగాధర, మే 11 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, చట్టం కేంద్రమంత్రికి చుట్టమా.? సామాన్య ప్రజలకు ఒక న్యాయం, కేంద్రమంత్రికి ఒక న్యాయమా అని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో.. బేటీ పడావో నినాదం నిజమయితే, బండి సంజయ్నున మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని, ఆయన కుమారుడు భగీరథ్ పై చట్టపరంగా చర్యలు తీసుకొని బాధిత బాలికకు న్యాయం చేయాలని రవిశంకర్ డిమాండ్ చేశారు.
గంగాధర మండలం, మధురానగర్ చౌరస్తాలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై 17 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపినా, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. మైనర్ బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బండి భగీరథ్ ను మాత్రమే అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తున్నారని, అసలు భగీరథ్ ఎక్కడ ఉన్నాడు..? పోలీసులు అతనిని ఎందుకు అరెస్టు చేయడం లేదని, చట్టం సామాన్యులకు ఒకలా, అధికార పార్టీలకు మరోలా వ్యవహరిస్తుందా.. అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రానికి అమ్మనవుతానని ప్రగల్భాలు పలికిన కవితక్క మైనర్ బాలిక విషయంలో మౌనం వహించారు ఎందుకని ప్రశ్నించారు. బాధితురాలికి అన్యాయం జరిగే విధంగా మధ్యవర్తిత్వం వహించిన సంగప్పపై కూడా చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో మహిళల భద్రత, బాలికల రక్షణ లేదని ఈ సంఘటనతో మరోసారి నిరుపితమైందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీజేపీ భేటీ బచావో నినాదం నిజమే అయితే బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని, రాజకీయ ఒత్తిళ్లను పక్కనపెట్టి బండి భగీరథ్‌ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మైనర్ బాలికకు న్యాయం జరగకపోతే ప్రజల్లో చట్టంపై విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలంగా మారిన మైనర్ బాలిక కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా కమిషన్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం, బీజేపీ మహిళా విభాగం మెదపకుండా మౌనం వహించడం వెనక కారణాలు తెలిపారన్నారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, సర్పంచ్‌లు వేముల దామోదర్, కరబూజ తిరుపతి గౌడ్, నాయకులు సాగి మహిపాల్ రావు, కంకణాల విజేందర్ రెడ్డి, ఉప్పుల గంగాధర్, ముక్కెర మల్లేశం, శ్రీమల్ల మేఘరాజు, ఎండీ నజీర్, రాసూరి మల్లేశం, పొట్టల కనకయ్య, దోమకొండ మల్లయ్య, పొన్నం పరశురాములు, ఎండీ అజ్జు, సముద్రాల అజయ్, నేరెళ్ల ఐలయ్య, గంగాధర మోహన్, కళ్ళపెళ్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.