పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మూడు జిల్లాలకు పదిలోపు స్థానాలు వచ్చాయి. ఎప్పటిలాగే 90శాతానికిపైగా ఉత్తీర్ణతతో మేటిగా నిలిచాయి. గతేడాది కరీంనగర్ జిల్లాకు 14వ స్థానం రాగా, ఈ సారి నాలుగోస్థానంలో నిలిచింది. రాజన్న సిరిసిల్ల ఒక స్టెప్పు ముందుకేసి ఆరోస్థానాన్ని దక్కించుకోగా, పెద్దపల్లి మూడు స్థానాలు ముందుకువచ్చి తొమ్మిదో స్థానానికి చేరింది. కాగా, ఈ సారి జగిత్యాల జిల్లా 24వ స్థానానికి పడిపోయింది. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలు జయకేతనం ఎగరేశాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, మైనార్టీ రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలల్లోని మెజార్టీ విద్యార్థులు 10 జీపీఏ సాధించగా, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయగా, మూడు జిల్లాలు మెరుగైన ర్యాంకులు సాధించాయి. కరీంనగర్ జిల్లాకు నాలుగోస్థానం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆరో స్థానం, పెద్దపల్లి జిల్లాకు తొమ్మిదో స్థానం రాగా, ఈ సారి జగిత్యాల జిల్లా 24స్థానానికి పడిపోయింది. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలు జయకేతనం ఎగరేశాయి. మెజార్టీ విద్యార్థులు 10 జీపీఏ సాధించగా, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
– కమాన్చౌరస్తా, మే 10
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది 14వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ సారి ఏకంగా పది స్థానాలు పైకి ఎగబాకి, 95 శాతం ఉత్తీర్ణతతో జయకేతనం ఎగరేసింది. జిల్లాలో మొత్తం 12,128 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11,521 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 6377 మంది పరీక్ష రాయగా, 6024 మంది 94.46 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 5751 మంది పరీక్ష రాయగా, 5497 మంది 95.58 శాతం ఉత్తీర్ణతతో పై చేయి సాధించారు.
జిల్లాలో 192 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 47 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, రెండు ప్రభుత్వ పాఠశాలలు, రెండు కేజీబీవీలు, నాలుగు మోడల్ స్కూల్స్, మూడు మైనార్టీ రెసిడెన్షియల్స్, ఆరు బీసీ వెల్ఫేర్, నాలుగు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో 66 మంది విద్యార్థులు 10 జీపీఏ, 124 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 155 మంది విద్యార్థులు 9.7 జీపీఏ, 166 మంది విద్యార్థులు 9.5 జీపీఏ సాధించారు. కాగా గతంతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.