కలెక్టరేట్, ఏప్రిల్ 5 : అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక ఆధారాలతో పార్లమెంటులో పోరాడి, దళితజాతి అభివృద్ధి ప్రదాతగా మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రాం నిలిచాడని, మానకొండూర్ ఎమ్మెల్యే, బాబు జగ్జీవన్‌రాం జయంత్యుత్సవ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ కొనియాడారు. బాబూ జగ్జీవన్‌రాం 118వ జయంత్యుత్సవాలు శనివారం నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, చదువే దళితుల అభివృద్ధికి దోహదపడుతుందని, బాబూ జగ్జీవన్‌రాం జీవితం స్పష్టం చేస్తుందన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తమ జీవితాలను ధారబోసిన మహనీయుల ఉత్సవాలు జరుపుకోవడంలో నిర్లక్ష్యం వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు వేళకు వచ్చినా, దళిత సోదరులు మాత్రం నామమాత్రంగానే హాజరవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, జాతీయోద్యమ పోరాటంలో బాబూ జగ్జీవన్‌రాం చేసిన అవిరాళమైందన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్‌రాం చదువుపై అత్యంత శ్రద్ధ చూపుతూ, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడని గుర్తుచేశారు. అంతకుముందు పలువురు దళిత, బహుజన నాయకులు మాట్లాడుతూ, దళితుల అభివృద్ధిపై పాలకులు చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై గతంలో గగ్గోలు పెట్టిన నాయకులు, ప్రస్తుత ప్రభుత్వంలో ఎటువైపు మళ్లిస్తున్నారో చెప్పాలని ఓ మహిళా నాయకురాలు ప్రశ్నించారు. అంతకుముందు కులాంతర వివాహాలు చేసుకున్న ఆరు జంటలకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూ.2.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. జగ్జీవన్‌రాం కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, మేడిపల్లితో పాటు కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, సీపీ గౌష్ ఆలం, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశ్, ఆర్డీవో కె.మహేశ్వర్‌తో పాటు పలువురు అధికారులు పూల మాలలు వేసి, నివాళులర్పించారు.
మూడు మాసాల క్రితం నగర శివారులోని బొమ్మకల్ గ్రామంలో తమ కుమారుడు బెజ్జంకి అనిల్‌ను దారుణంగా చంపిన ఘటనలో నిందితులైన ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ, మృతుడి తల్లిదండ్రులు బెజ్జెంకి ఎల్లయ్య, లక్ష్మి డిమాండ్ చేస్తూ, సమావేశంలో ఫ్లెక్సీ ప్రదర్శించారు. కాగా, దీనిపై తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెబుతూ, బాధిత వృద్ధులను నాయకులు సమావేశం నుంచి పక్కకు పంపించారు.
జగ్జీవన్‌రాం జయంత్యుత్సవ సమావేశంలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడు మేడి మహేశ్ మాట్లాడుతూ, దళిత మహనీయుల జయంత్యుత్సవాలకు జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హాజరు కాకపోవడం, దళితులను చిన్నచూపు చూస్తున్నారనేందుకు నిదర్శనమన్నారు. ఆహ్వానపత్రికలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫొటో ముద్రించకపోవడం, స్థానిక ఎమ్మెల్యేగా ఆయనను అవమానించడమేనన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జ్యోతిభాపూలే, అంబేద్కర్ విగ్రహాల ముసుగులు తొలగించడంలో నిర్లక్ష్యం వహించడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు డా.బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నామకరణం చేసినా, ఆయన కాంస్య విగ్రహం బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నగర శివారులోని చింతకుంట గ్రామపరిసరాల్లో రూ.6 కోట్లతో అంబేద్కర్ భవనం నిర్మించినా, ఇప్పటివరకు ఎందుకు వినియోగంలోకి తేవడం లేదని ప్రశ్నించారు. నగరంలోని భాగ్యరెడ్డి వర్మ కూడలి సుందరీకరణపై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి పలుమార్లు విన్నవించినా, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారని పలువురు వక్తలు మండిపడ్డారు. కొద్ది మాసాల క్రితం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో జరిగిన ఓ దళిత యువకుడి హత్య కేసులో నిందితులపై ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.