Godavarikhani | కోల్ సిటీ, జూలై 19 : చిన్న పామును చూస్తేనే అమడదూరం పరుగెడుతాం. అలాంటిది భారీ కొండ చిలువ ను చూస్తే ఏలా ఉంటుంది.. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ.. నిజమే.. గోదావరిఖని నగరంలో శుక్రవారం అర్ధరాత్రి అలాంటి కొండ చిలువ ఒకటి ప్రత్యక్షమైంది.
స్థానిక 11వ డివిజన్ సంజయ్ నగర్ లో పొడవాటి కొండ చిలువ కనిపించడంతో స్థానికులు హైరానా పడ్డారు. పక్కనే గల సింగరేణి ఓసీపీ-5 ఓవర్ బర్డెన్ మట్టి కుప్పల నుంచి ఈ కొండ చిలువ వచ్చినట్లు గుర్తించారు. స్థానికుల అలజడికి బెదిరిన కొండ చిలువ బండరాళ్ల కిందకు వెళ్లింది.
ఇంతకీ బయటకు రాకపోవడంతో పాములు పట్టే కిశోర్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొని ఆ కొండ చిలువను పట్టి జాగ్రత్తగా సంచిలో వేసుకొని అడవిలో వదిలి పెట్టేందుకు తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా పక్కనే సింగరేణి ఓసీపీ మట్టి కుప్పల నుంచి నిత్యం పాములు, ఇతర విషపు కీటకాలు ఇళ్ల మధ్యకు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. తరచుగా పాములు వస్తుండటంతో రాత్రి పూట బయటకు రాలేకపోతున్నామని చెబుతున్నారు.