Gambeeravupeta | గంభీరావుపేట, జనవరి 1 : గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు గత పదిహేళ్లుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటూ అనాథ వృద్ధులకు ఆర్థిక సాయం చేస్తూ వారికి దగ్గరవుతున్నారు. మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమానికి రూ.15 వేల విలువగల నిత్యవసర సరుకులను చిన్నారులు గురువారం అందించారు.
నూతన సంవత్సర వేడుకలకు అనవసరపు ఖర్చులు పెట్టుకోకుండా చిన్నారులు సమిష్టిగా పోగు చేసుకున్న రూపాయలను నూతన సంవత్సరం సందర్భంగా వృద్ధులకు అందించడం గత పదిహేళ్లుగా ఆ పాఠశాల విద్యార్థులు కొనసాగిస్తున్నారు. 2026 నూతన సంవత్సరం పురస్కరించుకుని అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు వారు బియ్యం, నూనె, పప్పులు, పండ్లు, బ్రేడ్ తదితర రూ.15 వేల విలువ గల నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులతోపాటు ఉపాధ్యాయ బృందాన్ని మా స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థ వ్యవస్థాపకుడు, అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు మల్లు గారి నరసయ్య గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డి సంతోష్ రెడ్డి, ఉపాధ్యాయులు పద్మజ, కిషన్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.