Awareness programs | పెద్దపల్లి, అక్టోబర్8: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జాతీయ పొగాకు నియంత్రణ, జాతీయ అంధత్వం, దృష్టి లోపం నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని డీఎంహెచ్వో వాణి శ్రీ సంబంధిత అధికారులకు సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈనెల 9 నుంచి డిసెంబర్ 12 వరకు 60 రోజుల పాటు నేషనల్ టోబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే జాతీయ అంధత్వం, దృష్టిలోపం నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 8న అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరములు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈనెల 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు ఆర్.రాజమౌళి, బీ శ్రీరాములు, సుధాకర్ రెడ్డి, కిరణ్ కుమార్, ఎన్సీడీ జిల్లా కో -ఆర్డినేటర్ టీ రాజేశం పాల్గొన్నారు.