Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 29 : చిగురుమామిడి మండల కేంద్రంలోని కేజీబీవీ (కస్తూర్బా) లో విద్యార్థులకు నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేజీబీవీ ఎస్వో సుజాత అధ్యక్ష వహించారు. చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్, మిషన్ వాత్సల్య ఔట్రీచ్ వర్కర్ సాదినేని రమేష్, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ కవిత, కానిస్టేబుల్ అనూష , హెల్త్ సూపర్వైజర్ పద్మ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులకు మత్తు పదార్థాలు, డ్రగ్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, కుటుంబంపై మరియు భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
అలాగే సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకూడదని, వారికి వ్యక్తిగత వివరాలు, ఫొటోలు లేదా ఇతర సమాచారాన్ని ఇవ్వకూడదని సూచించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద సందేశాలు, లింకులు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా అపరిచిత వ్యక్తులను సులభంగా నమ్మకుండా, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు, వాటికి సంబంధించిన చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని, విద్యపై దృష్టి పెట్టి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.