కోల్‌సిటీ, జూన్ 19 : రామగుండం బల్దియా ప్రజాధనం వృథా చేస్తున్నది. పారిశుధ్య నిర్వహణ కోసం ఇష్టారాజ్యంగా ఆటో ట్రాలీలు, డస్ట్బిన్లు, ట్రాక్టర్లు కొంటూ, వినియోగంపై తీవ్ర ఆశ్రద్ధ చేస్తున్నది. కొంత పాతవి కాగానే పక్కకు పడేసి, మళ్లీ కొత్తవి కొనుక్కుంటూ పోతున్నది. వాహనాల వినియోగంలో కావాలనే నిర్లక్ష్యం చేయడం వల్లే కొన్న కొద్ది కాలానికే స్క్రాప్‌గా మారిపోతూ, కార్యాలయం వెనుకాలే తుప్పుపట్టిపోతున్నాయి.
కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు కుమ్మక్కయి పట్టణ ప్రగతి, 14వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులను దుబారా చేస్తున్నారనే ఆరోపణలు వస్తుండగా, ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, విషయమై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్‌ను వివరణ కోరగా, వాహనాల వినియోగంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, వర్షాలు, ఇతర సాంకేతిక కారణాలతో వాటి కండిషన్ దెబ్బతినడం వల్లే పక్కకు పెట్టినట్టు చెప్పారు. తుప్పుపట్టిన వాహనాల వేలం కోసం టెండర్లు పిలిచామని, త్వరలోనే వాటిని విక్రయించి కార్పొరేషన్‌కు ఆదాయం సమకూర్చేందుకే చర్యలు తీసుకుంటామని చెప్పారు.