కొత్తపల్లి, సెప్టెంబర్ 30 : కరీంనగర్ జిల్లా కేంద్రంలో క్రీడా సందడి నెలకొంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ పోటీల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు, 66 మంది కోచ్‌లు, మేనేజర్లు, 45 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటున్నారు. ఉజ్వల పార్క్ సమీపంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాల ఈ పోటీలకు వేదికైంది. అండర్-14, 16, 18, 20 సంవత్సరాల లోపు బాల బాలికలకు, పురుషులు, మహిళలకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. పోటీల మొదటిరోజు 20, 10, 5వేల మీటర్ల రేస్‌వాక్, షాట్‌ఫుట్, లాంగ్‌జంప్, డిస్కస్‌త్రో, హైజంప్, 100 మీటర్ల రన్నింగ్, 100 మీటర్ల హార్డిల్స్ తదితర పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు.
కరీంనగర్లో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయడంతోనే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ చాంపీయన్షిప్ పోటీలను నిర్వహించే అవకాశం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్‌కు దక్కింది. బోయినపల్లి వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో ఖేలో ఇం డియా పథకంలో భాగంగా ఈ ట్రాక్‌ను మంజూ రు చేయించారు. కాగా, పోటీల నిర్వహణలో ఖచ్చితత్వం కోసం మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఫొటో ఫినిష్ టెక్నాలజీని ఈ పోటీల్లో వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీతో క్రీడాకారుల ప్రతిభను సెకన్లతో ఈ కెమెరా క్యాప్షర్ చేయనుంది. కాగా, సాయంత్రం అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను సీపీ సుబ్బారాయుడుతో కలిసి కలెక్టర్ బీ గోపి ప్రారంభించారు. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పాల్గొననున్నారు. పోటీలు రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు స్టాన్లీ జోన్స్, సారంగపాణి, జిల్లా క్రీడల అభివృద్ధికి అధికారి రాజవీరు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, కడారి రవి నిర్వహణలో సాగుతున్నాయి.