కమలం పార్టీలో కల్లోలం రేగుతున్నది. తాజాగా శాసనసభ అభ్యర్థుల టికెట్ల కేటాయింపుపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆది నుంచీ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారిని కాదని.. కొత్తగా ఊడిపడిన పారాచూట్ నాయకులకు టికెట్లు ఇవ్వడం పార్టీ శ్రేణులను కంగుతినిపించింది. కష్టపడిన వారికే టికెట్లంటూ ఇన్నాళ్లు చెప్పిన నాయకత్వం, ఇప్పుడు సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై క్యాడర్లో ఆగ్రహం కనిపిస్తున్నది.
స్వయంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ రాజేందర్ ఉన్న జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే.. కష్టపడినోళ్లకు న్యాయం ఎప్పుడు జరుగుతుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న భావనతో ఇప్పటికే రాజీనామాల పర్వం మొదలు కాగా, క్షేత్రస్థాయి నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి మెజార్టీ నియోజకవర్గాల్లో శ్రేణులు సమాయత్తం అవుతున్నట్లుగా పార్టీలోనే చర్చ జరుగుతుండగా, ఇంకా టికెట్లు కేటాయించని నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
– కరీంనగర్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న కమలం పార్టీలో ప్రస్తుతం కల్లోల పరిస్థితి కనిపిస్తున్నది. అధిష్ఠానం ఇటీవల కేటాయించిన టికెట్ల తీరుపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆది నుంచీ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నేతలను కాదని కొత్త వారికి టికెట్లు ఇచ్చిన తీరుపై శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. ‘కష్టపడిన వారికే టికెట్లు’ అంటూ ఇన్నాళ్లు చెప్పిన నేతలే, ఇప్పుడా విధానాలను తుంగలో తొక్కుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల టికెట్ల కేటాయింపులు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, అందులో మంథని, వేములవాడ, పెద్దపల్లి, హుస్నాబాద్ మినహా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలివిడుత జాబితాను తాజాగా విడుదల చేసిం ది. అందులో ఐదు నియోజకవర్గాలకు కేటాయించిన టికెట్లపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. కోరుట్లకు ధర్మపురి అర్వింద్, జగిత్యాలకు బోగ శ్రావణి, రామగుండానికి కందుల సంధ్యరాణి, సిరిసిల్లకు రాణి రుద్రమదేవి, మానకొండూర్‌కు ఆరెపల్లి మోహన్ టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలపై పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడినట్లుగా తెలుస్తున్నది. నిజానికి ఈ నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారు ఉన్నారు. అంతేకా దు, ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నవారు ఉన్నారు. వాళ్లందరినీ కాదని, పారాచూట్ నాయకులకు టికెట్లు ఇచ్చారన్న విమర్శలు ఆ పార్టీలో బాహాటంగా వినిపిస్తున్నాయి.
జగిత్యాల నియోజకవర్గంలో ఇటీవలే బీజేపీలో చేరిన బోగ శ్రావణికి టికెట్ కేటాయించారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి ముదిగంటి రవీందర్ రెడ్డి టికెట్ ఆశించారు. ఆయన మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు. రవీందర్ రెడ్డి తండ్రి ముదిగంటి మల్లారెడ్డి ఆర్ఎస్ఎస్లో 60 ఏండ్లకు పైగా పనిచేశారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడి శా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ గా పనిచేశారు. అలాగే డాక్టర్ శైలేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశించారు. ఈటల రాజేందర్, బండి సంజ య్ ఇద్దరూ శైలందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీలో చేర్చుకున్నట్లుగా ప్రచా రం జరిగింది. న్యాయవాది చిలుక మర్రి మదన్మోహన్, పన్నాల తిరుపతిరెడ్డి ఇలా పలువురు కూడా టికెట్ ఆశించారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు బోగ శ్రావణికి టికెట్ ఇవ్వడంతో వీరి ఆశలు గల్లంతయ్యాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోరుట్ల నియోజకవర్గాన్ని అర్వింద్‌కు కేటాయించడంతో ఇక్కడి ఆశావహులకు నిరాశే మిగిలింది. నమ్ముకున్న నాయకుడే టికెట్ ఎగరేసుకుపోయారన్న అభిప్రాయాలు ఆ పార్టీ లో వ్యక్తమవుతున్నాయి. అర్వింద్ పార్టీ బలోపేతం పేరిట కోరుట్ల నియోజకవర్గంలో చేరికలను ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే మెట్పల్లి పట్టణానికి మాజీ సర్పంచ్ సాంబారి ప్రభాకర్, జడ్పీటీసీ మాజీ సభ్యులు ఆకుల లింగారెడ్డి, డాక్టర్ రఘు, సురభి నవీన్‌కుమార్, న్యాయవాది బద్దం గంగాధర్ తదితరులు బీజేపీలో చేరారు. వీరితోపాటు గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన డా. జేఎన్ వెంకట్, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు జేఎ న్ సునీత దంపతులు ఆ ఎంపీని నమ్ముకొని టికె ట్ కోసం గంపెడాశలు పెట్టుకున్నారని పార్టీ చర్చించుకుంటున్నది.
ఎవరికి వారే ఎంపీ ప్రాపకం కో సం ప్రయత్నాలు చేస్తే.. తీరా ఆయనే ఎగరేసుకుపోయారన్న ఆందోళన వారిలో కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లోనే కొంత మంది నాయకులు కొత్త బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. కొద్ది రోజుల్లోనే కొంత మంది నా యకులు తమ భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది. సిరిసిల్ల నియోజకవర్గం లో రాణి రుద్రమకు టికెట్ ఇచ్చారు. ఇక్కడ నుం చి న్యాయవాది ఆవునూరి రమకాంత్రావు, లగిశెట్టి శ్రీనివాస్‌తో పాటు బీజేపీ పార్లమెంటరీ కో-కన్వీనర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీంద ర్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి తదితరులు టికెట్ ఆశించారు. అధిష్ఠానం మాత్రం రాణి రుద్రమకు టికెట్ కేటాయిం చి వీరి ఆశలపై నీళ్లు చల్లింది.
మానకొండూర్ నియోజకవర్గంలో గడ్డం నాగరాజు ఆది నుంచీ పార్టీలో పనిచేస్తున్నారు. ఎంతో కాలం నుంచి సా మాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనతో పా టు మరో ఇద్దరు నేతలు ఇక్కడి నుంచి టికెట్ ఆ శించారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆరెపల్లి మోహన్‌కు ఇక్కడ టికెట్ ఇవ్వడంతో ఆశావహుల ఆశల పై నీళ్లు చల్లినట్టయింది. రామగుండంలో తాజాగా చేరిన కందుల సంధ్యరాణికి టికెట్ ఇచ్చారు. నిజానికి ఈ ప్రాంతం నుంచి పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రావుల రాజేందర్‌తోపాటు మరికొంత మంది టికెట్ ఆశించారు. కానీ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ఆశలు అడియాసలే అయ్యాయి.
పదమూడు నియోజకవర్గాలకు గాను మంథ ని, వేములవాడ, పెద్దపల్లి, హుస్నాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నియోజకవర్గాల్లోనూ ఏమీ జరుగుతుందో అన్న ఆందోళన ఆయా నియోజకవర్గాల్లోని శ్రేణుల్లో కనిపిస్తున్నది. ఇక్కడ కూడా ఆది నుంచి పనిచేసిన వారికి ఇస్తారా..? లేక ఇప్పుడు కేటాయించిన మాదిరిగానే పారాచూట్ నాయకులకే ఇస్తారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ రాజేందర్ ఉమ్మడి జిల్లానుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, పార్టీ కోసం ముందు నుంచి ఎవరో పనిచేస్తున్నారో తెలిసి కూడా పారాచూట్ నాయకులకు టికెట్లు కేటాయిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు జరుగుతున్న తతంగాన్ని చూస్తున్న ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వం అంతర్మథనంలో పడిందని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
పార్టీని నమ్ముకొని పనిచేయడం వల్ల లాభం లేదని, ఎన్నికల సమయం లో వచ్చి అగ్రశ్రేణి నాయకత్వంతో మాట్లాడుకుం టే టికెట్లు వస్తాయన్న చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చాలా మంది పార్టీని వీడడంతోపాటు తమ భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తున్నది. ఇప్పటికే సిరిసిల్ల నియోజకవర్గంలో న్యాయవాది, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆవునూరి రమకాంత్రావు పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ల కేటాయింపులో ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టిన ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కానీ, వాటిపై ఇప్పటి వరకు పార్టీ నాయకత్వం సమాధానం చెప్పలేదు. ఈ పరిస్థితుల్లోనే రమకాంత్రావు పార్టీ ని వీడి గులాబీ పార్టీలో చేరారు. ఇదే బాటలో మరికొంత మంది నాయకులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. నమ్ముకున్నోళ్లకే న్యా యం చేయని అధిష్ఠానం, ప్రజలకు ఏం చేస్తుందని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి.