రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): నేతన్నలపై సర్కారు నిర్బంధకాండ కొనసాగిస్తున్నది. తమ సమస్యల పరిష్కారం, కూలీ రేట్లు నిర్ణయించాలని చేపట్టిన నిరవధికను సమ్మెపై ఉక్కుపాదం మోపి విచ్ఛిన్నం చేసింది. ఆర్డర్లు ఇచ్చిన ఇందిరమ్మ చీరల తయారికి కూలీ రేట్లు ప్రభుత్వమే నిర్ణయించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మూడు రోజులుగా మరమగ్గాల కార్మికులు సాంచాలు బంద్ పెట్టి సమ్మె చేస్తున్నారు.
చేనేతజౌళీశాఖ అధికారులు పట్టించుకోక పోవడం వల్లనే యజమానులు మొండి వైఖరి అవలంభిస్తున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలంటూ నిరసన కూడా చేస్తున్నారు. ఈ మేరకు గురువారం సిరిసిల్ల బీవైనగర్‌లోని పాత చేనేత జౌళీశాఖ కార్యాలయం ఎదుట సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌యూనియన్ నాయకులు మూషం రమేశ్, కోడం రమణ, వార్పిన్, వైపనీ అసోసియేషన్ నాయకులు కార్మికులతో సమావేశమయ్యారు.
జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ తీయాలని చర్చించుకుంటున్న క్రమంలో పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. ర్యాలీ తీసేందుకు అనుమతి లేని చెప్పగా, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని కార్మికులు వివరణ ఇచ్చినా వినిపించుకోలేదు. అరెస్టు చేసి వ్యానులో స్టేషన్‌కు తరలించారు. అరెస్టు విషయం తెలుసుకొని తోటి కార్మికులంతా పోలీస్‌స్టేషన్‌కు తరలి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ కొద్దిసేపటికే కార్మికులను పోలీసులు రిలీజ్ చేశారు.
అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తాం
శాంతియుతంగా నిరసన తెలిపితే ప్రభుత్వం పోలీసులను పంపి తమను నిర్బంధించింది. అరెస్టు చేసినంత మాత్రాన భయపడేది లేదు. 300 వార్పిన్లలో ఒక్కటి కూడా నడవదు. కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి కూలీ రేట్లు నిర్ణయించింది. కార్మికులకు చేతి నిండా పని, పనికి తగ్గ వేతనం కల్పించింది.
కాంగ్రెస్ వచ్చి అన్నింటికీ మంగళం పాడింది. కార్మికులు పనిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇందిరమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. కానీ, కార్మికుల కూలీ రేట్లు, అందులో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించక పోవడం మా దౌర్భాగ్యం. అధికారులు చొరవ చూపాలి. యజమానులు మొండి వైఖరి వీడి చర్చలకు రావాలి. లేదంటే ఆమరణ దీక్ష చేస్తాం. మా డిమాండ్లు సాధిస్తాం.
– ఉడుత రవి, వార్పిన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు
నిర్బంధాలతో పోరాటాన్ని అణచలేరు
కాంగ్రెస్ సర్కారు యజమానులకు తొత్తుగా మారింది. శాంతియుతంగా సమ్మె చేస్తున్న మాపై ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం పోలీసులను రంగంలోకి దింపి భయపెడుతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల తయారీ కూలీ కన్నా తక్కువ ఇస్తే సహించేది లేదు. కార్మికుల ప్రయోజనాలకు కాకుండా చీరలకే ఎక్కువ ప్రాముఖ్యత నిస్తున్నట్లు సర్కారు తీరు కనిపిస్తున్నది. నిర్భందాలతో నేతన్నల పోరాటాలను అణచలేదు.
– మూషం రమేశ్, పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు