Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 15: గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలు జిల్లాలోని పలు ప్రధాన రహదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అనేకచోట్ల రహదారులు ద్వంసం కాగా, కాజ్వేలు, కల్వర్టులు కూడా దెబ్బతిన్నాయి. రోడ్ల డ్యామేజీని గుర్తించిన సంబంధితాధికారులు మరమ్మతుల కోసం అంచనాలు వేసి ప్రతిపాదనలు పంపగా, తాత్కాలిక మరమ్మత్తుల కోసం అరకొరగా నిధులు విడుదల చేయగా, గుత్తేదారులు మాత్రం టెండర్లు వేసేందుకు ముందుకు రావటం లేదని తెలుస్తోంది.
గతేడాది మరమ్మత్తులు చేసిన రోడ్లకు కూడా నయాపైసా విడుదల చేయకపోవటంతో, ఈసారి కూడా విడుదల చేస్తారో? లేదోననే అనుమానాలతో గుత్తేదారులు టెండర్లు వేసేందుకు ముందుకు రావటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా తారు రోడ్లపై అనేక చోట్ల పైపొరలు తొలగిపోగా, వీటిలో ప్రధాన రహదారులతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధానమైన రోడ్లు కూడా ఉన్నాయి. పండుగలు, ఇతర కార్యక్రమాల నేపథ్యంలో అత్యవసరంగా మరమ్మత్తులు చేపట్టాల్సి ఉండగా, చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరికొద్ది వారాల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడిస్తుండగా, ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి, అనంతరం శాశ్వత చర్యలు తీసుకోవాలంటూ నివేదికలు పంపినా, నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వ తీరు ఉందనే వ్యాఖ్యలు యంత్రాంగం నుంచి వినిపిస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతుల కోసం వస్తున్న ఒత్తిడితో రూ. కోటి వరకు మంజూరైనా, జిల్లాలోని రోడ్లకు ఆ మొత్తం ఎంతమేర సరిపోతాయనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తారు లేచి, అడుగులోతు గోతులతో ప్రమాదకరంగా మారిన రోడ్లపై రాకపోకలు కొనసాగించటం మృగ్యమవుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 600 కిమీల మేర బిటి రోడ్లు ఉండగా, వీటిలో సగానికి పైగా రహదారులు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి, ఉన్నతాధికారులకు నివేదించారు.
వీటికితోడు మరో 50 కిమీల మేర భారీ స్థాయిలో ధ్వంసమైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. మరమ్మత్తుల కోసం రూ. 3కోట్ల నిధులు ఖర్చవుతాయనే అంచనాలు పంపి, నిధులు విడుదల చేయాలంటూ కోరగా కేవలం రూ. కోటి మాత్రమే మంజూరు చేసి, వీటితోనే ప్రస్తుతానికి సరిపెట్టాలంటూ రహదారులు, భవనాల శాఖ సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో, ఆఘమేఘాల మేద సదరు యంత్రాంగం టెండర్లు పిలవగా గతేడాది చేపట్టిన మరమ్మత్తులకే ఇప్పటివరకు డబ్బులు చెల్లించలే అప్పు తెచ్చి పనులు చేస్తే బిల్లులు రాక తెచ్చిన అప్పులకు తిరుగు కాయితాలు పెట్టాల్సి వస్తుందని గుత్తేదారులు వాపోతున్నారు. తాజాగా వేసిన టెండర్లలో మళ్ళీ పాల్గొంటే సకాలంలో బిల్లులు రాకపోతే పాత, కొత్త అప్పులు తడిసి మోపెడవుతాయనే భయంతో తాము వెనుకడుగేస్తున్నట్లు గుత్తేదారులు బహిరంగంగానే చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో జిల్లాలో కేవలం తిమ్మాపూర్, మానకొండూర్, గంగాధర మూడు సెక్షన్లలో మాత్రమే టెండర్లు రాగా, మిగతా ఆరు సెక్షన్లలో ఒక్క గుత్తేదారు కూడా పాల్గొననట్లు ఆర్ అండ్ బి కార్యాలయవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో, మరోసారి టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆశాఖ అధికారులు తెల్పుతుండగా, ఈసారి కూడా అవే పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత సిబ్బంది పేర్కొంటున్నారు. జిల్లాలోని జాతీయ రహదారుల పరిస్థితి కూడా ఆర్అండ్ బి రోడ్లకు తీసిపోకపోవటంతో ఈరోడ్లపై రాకపోకలు కొనసాగించే వాహనచోదకుల పరిస్థితులు దయనీయంగా మారాయి.
జగిత్యాల కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారుల నిర్మాణ పనులు కొన.. సాగుతుండగా మొన్నటి వానలకు మరింత అధ్యాన్నంగా మారగా, వీటిపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. ఈ మార్గాల్లో రాత్రి పూట ప్రయాణాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నా కనీస పట్టింపులేకపోవటంతో వాహనచోదకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పాలకులు ఇప్పటికైనా దృష్టి సారించి ప్రధాన రహదారులపై తొలిగిన తారు మరమ్మతుల పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది.