కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల కడుపుమాడుతున్నది. అధికారులు, గుత్తేదారుల పంతంతో పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. తాము చెప్పిన ధరకే వెజిటేబుల్స్ పంపిణీ చేయాలని యంత్రాంగం పట్టు పడుతుండగా, తమకు గిట్టుబాటు కానిది ఎలా ఇచ్చేదని కాంట్రాక్టర్లు మొండికేయడంతో కరీంనగర్ జిల్లాలోని స్కూళ్లకు కూరగాయల సరఫరా నిలిచిపోయింది. పదిహేను రోజులుగా తాజా కాయగూరల భోజనం కరువవగా.. నిత్యం పప్పు, చారుతో పిల్లలు తినలేకపోతున్నారు. సరైన ఫుడ్ పెట్టకపోతే, దాని ప్రభావం వారి చదువులపై పడే అవకాశమున్నదని, ఉన్నతాధికారులు స్పందించి సత్వరమే కూరగాయల సమస్య పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 27: కరీంనగర్ జిల్లాలో 14 కేజీబీవీలు, 11 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. అందులో చదువుకుంటున్న విద్యార్థుల భోజనానికి నిత్యం గుత్తేదారులు కూరగాయలు సరఫరా చేస్తుంటారు. ఇటీవల కాంట్రాక్టు ముగియగా కొత్త టెండర్లు పిలిచారు. అయితే, మండలాల వారీగా ఎక్కడికక్కడే టెండర్లు వేసేలా కొత్త నిబంధన విధించడంతో, దీనిని వ్యతిరేకిస్తూ పలువురు కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లారు. దీంతో, తాత్కాలికంగా ప్రస్తుతం ఉన్న వారికే అధికారులు అవకాశం కల్పించారు. అయితే ఇటీవలి కాలంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిన దృష్ట్యా తమకు మిగిలేదేమి లేదని, ఇతర ప్రభుత్వ హాస్టళ్ల మాదిరిగా కిలోకు 30 చొప్పున చెల్లించాలని గుత్తేదారులు.. కరీంనగర్ అదనపు కలెక్టర్‌ను కోరారు. దీంతో ఆమె అంగీకరించి సంబంధిత అధికారులకు సూచించారని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
అయితే, సదరు అధికారి మాత్రం ససేమిరా అనడంతో కూరగాయల సరఫరా నిలిపేస్తామని స్పష్టం చేసినా, మీరెలా సరఫరా చేయరో చూస్తానంటూ ఆ అధికారి మండిపడ్డారని గుత్తేదారులు వాపోతున్నారు. అధికారుల ఒత్తిడికి భయపడకుండా కాంట్రాక్టర్లు మొండికేయడంతో తమ పిల్లల భోజనాల పరిస్థితి కడుదయనీయంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం రోజుకు రెండు రకాల కూరలు, ఇతర అనుబంధ ఆహార పదార్థాలతో భోజనం అందించాల్సి ఉండగా, కేవలం పప్పు, చారు, నాన్‌వెజ్ వంటకాలతో మాత్రమే వడ్డిస్తున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు.
కొన్నిచోట్ల మాత్రం ఎస్వోలే స్వయంగా కూరగాయలు తెచ్చి వంటలు చేయిస్తున్నట్టు తెలుస్తున్నది. వాస్తవానికి గుత్తేదారులే విద్యార్థుల సంఖ్యను బట్టి ఏరోజుకారోజు తాజా కూరగాయలు కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల వంటశాలల వద్దకు సరఫరా చేస్తారు. పదిహేను రోజుల నుంచి కూరగాయల సరఫరాదారుల డిమాండ్‌పై సంబంధితాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుండగా, పౌష్టికాహారానికి బదులు చప్పిడి తిండి తినాల్సి వస్తున్నదని విద్యార్థులు వాపోతున్నారు. అధికారుల పట్టింపులేనితనంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు గమనించి తామే కూరగాయలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నా, ఎన్నాళ్లిలా..? తీసుకెళ్లడమంటూ ఎస్వోలు మండిపడుతున్నారు.
కాగా, నిబంధనల ప్రకారం టెండర్ దక్కించుకున్న నాటి నుంచి కొత్త టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేవరకు కూరగాయలు సరఫరా చేయాల్సిన బాధ్యత పాతకాంట్రాక్టర్లదేనని, ధరల పెంపుపై ఉన్నతాధికారులు ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయలేదని, ఇతర జిల్లాల్లో తక్కువ ధరలు ఉండగా, మన జిల్లాలో అధిక ధరలు నిర్ణయించడం ఎలా సాధ్యమవుతుందని, గుత్తేదారులే నిబంధనలు ఉల్లంఘించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని సంబంధితాధికారులు పేర్కొంటున్నారు. అయితే విద్యార్థులకు పరీక్షల కాలం కాగా, సరైన భోజనం వడ్డించకపోతే, దాని ప్రభావం వారి చదువుపై పడే అవకాశాలుంటాయని, ఉన్నతాధికారులు స్పందించి సత్వరమే కూరగాయల సరఫరాపై దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.