వైద్యరంగంలో కీలకమైన నర్సింగ్ విద్యను రాష్ట్ర సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 16 నర్సింగ్ కళాశాలతోపాటు పాత కాలేజీల్లో బోధకుల నియామకంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఎన్సీసీ) మార్గదర్శకాల ప్రకారం 10:1 నిష్పత్తిలో అంటే ప్రతి పది మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాల్సి రాగా, ఏదో కొద్దిపాటి మందితో సర్దుబాటు పద్ధతిలో నెట్టుకొస్తున్నది. అసలే అద్దె భవనాలు.. ఆపై అరకొర వసతులతో నడుస్తున్న కళాశాల్లో రోజురోజుకూ బోధన కుంటుపడిపోతుండగా, స్టూడెంట్లకు తీరని నష్టం జరుగుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరమున్నది.
కరీంనగర్, జూన్ 15 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: వైద్య రంగంలో నర్సింగ్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. నాలుగేండ్ల ఈ కోర్సులో 8 సెమిస్టర్లు పూర్తి చేయాల్సి ఉండగా, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) మార్గదర్శకాల ప్రకారం ప్రతి నర్సింగ్ కాలేజీలో 10:1 చొప్పున ఫ్యాకల్టీస్ ఉండాలి. అంటే ప్రతి పది మంది విద్యార్థులకు ఒక టీచింగ్ అధ్యాపకుడిని నియమించినప్పుడే తరగతుల బోధన సరిగ్గా జరుగుతుంది. కానీ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 16 నర్సింగ్ కళాశాలల్లో ఐఎన్‌సీ మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావడం లేదు.
2024 డిసెంబర్లో కరీంనగర్‌తోపాటు కొడంగల్, ఆంధోల్, నిజామాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఆసిఫాబాద్, కుద్బుల్లాపూర్, మహేశ్వరం, మెదక్, ములుగు, యాదాద్రి భువనగిరి, నారాయణపేట్, నిర్మల్, రామగుండంలో నర్సింగ్ కాలేజీలను ప్రారంభించగా, ఇప్పటి వరకు ఒక్క చోట కూడా పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ నియామకం జరగలేదు. ఉన్న కొద్ది మంది ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తుండగా, సరైన బోధన లేక విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. కొత్త కాలేజీల్లోనే కాదు, రాష్ట్రంలోని మిగతా నర్సింగ్ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.
ఐఎన్సీకి మార్గదర్శకాలకు తిలోదకాలు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 2018లో ఏర్పాటు చేసిన నర్సింగ్ కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలేజీలో 400 మంది అభ్యసిస్తున్నారు. ఐఎన్‌సీ మార్గదర్శకాల ప్రకారం ఈ కాలేజీలో ప్రొఫెసర్ క్యాడర్లో ఉండే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్స్ ఉండాలి. ఏడుగురు ప్రొఫెసర్లు, 12 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20 మంది లెక్చరర్లు ఉండాలి. ఇక 2021లో ఏర్పాటు చేసిన గద్వాల్, సిద్దిపేట, బాన్సువాడ నర్సింగ్ కళాశాలల్లోనూ ఇదే క్యాడర్ స్ట్రెంత్తో ఫ్యాకల్టీస్ ఉండాల్సి ఉండగా, సరిపడా లేరు.
ఈ రెండు కాలేజీల నుంచే 2024లో ఏర్పాటు చేసిన 16 కొత్త కళాశాలలకు సర్దుబాటు చేయడంతోనే కొరత ఏర్పడింది. ప్రస్తుతం సిరిసిల్ల కళాశాలలో చూస్తే 12 మంది లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. మిగతా మూడు నర్సింగ్ కళాశాలల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు తెలుస్తున్నది. ఐఎన్‌సీ మార్గదర్శకాల ప్రకారం 40 సీట్లు ఉన్న కళాశాలలో 16 మంది, 60 సీట్లు ఉన్న కాలేజీలో 24 మంది, 100 సీట్లు ఉన్న కాలేజీలో 40 మంది ఫ్యాకల్టీస్ అందుబాటులో ఉండాలి. కానీ, రాష్ట్రంలోని 37 నర్సింగ్ కళాశాలలో ఎక్కడా ఈ మార్గదర్శకాలు అమలు కావడం లేదని తెలుస్తున్నది.
విద్యార్థులకు తీవ్ర నష్టం
నర్సింగ్ విద్యార్థులకు మంచి బోధన అందినప్పుడే వారు తమ నైపుణ్యం పెంచుకునే అవకాశముంటుంది. కానీ, ఏ కళాశాలలోనూ పూర్తి స్థాయి ఫ్యాకల్టీ లేకపోవడంతో నష్టపోవాల్సి వస్తున్నది. ప్రొఫెసర్ క్యాడర్‌కు ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగించాలి. కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కూడా ఇన్చార్జి ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. సీనియర్ లెక్చరర్లను వైస్ ప్రిన్సిపాళ్లుగా నియమిస్తున్నారు. టీచింగ్ ఫ్యాకల్టీని ఇష్టారీతిలో నియమిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రతి కళాశాలకు ఎమ్మెస్సీ స్టాఫ్ నర్సులను బోధనా సిబ్బందిగా తీసుకుంటున్నారు.
అనుభవం లేని వారితో పాఠాలు చెప్పిస్తున్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు టీచింగ్ స్టాఫ్‌కు పదోన్నతులు కల్పించ లేదు. 2019లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే వీరికి కల్పించిన పదోన్నతులు చివరివి. ప్రమోషన్లు కల్పించకుండానే కీలకపోస్టులు అప్పగిస్తున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విద్యార్థుల చదువులు అటకెక్కే పరిస్థితి కనిపిస్తున్నది. ఇక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కళాశాలకు ప్రభుత్వం నెలల తరబడి అద్దె చెల్లించడం లేదని, దీంతో ఖాళీ చేయిస్తామని భవనాల యజమానులు అధికారులతో గొడవకు దిగుతున్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి ఎంతో ఉన్నతమైన నర్సింగ్ విద్యను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికైనా ప్రతి కళాశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి బోధన సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది. లేదంటే విద్యార్థులు మరింత నష్టపోయే ప్రమాదమున్నది.