ఐదు నెలల క్రితం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేయించిన రాష్ట్ర ప్రభుత్వం, తీరా పనిపూర్తయ్యాక సర్వే సిబ్బందికి మొండిచేయి చూపింది. గణన ప్రారంభానికి ముందే పారితోషికం నిధులు విడుదల చేసి ఆశలు రేకెత్తించినా.. ఆ తర్వాత ఇవ్వకుండా చోద్యం చూస్తున్నది. అధికారులు రెమ్యూనరేషన్ డబ్బులు ఖాతాల్లో జమచేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే వెనక్కి తీసుకొని ఇతర అవసరాలకు వినియోగించుకున్నట్టు తెలుస్తుండగా, సిబ్బంది ఆగ్రహిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విసిగివేసారి పోతున్నారు. పారితోషికం ఎప్పుడొస్తుందా..? అని ఎదురుచూపులు చూస్తున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, మే 15: స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల కులాలకు రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం గతేడాది నవంబర్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన (ఇంటింటి సమగ్ర కుటుంబ) సర్వే చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో 3,171మంది సిబ్బందిని సర్వే కోసం వినియోగించగా, అందులో 2,864 మంది ఎన్యూమరేటర్లు, 287 మంది సూపర్వైజర్లు, 20 మంది ప్రత్యేకాధికారులతో పాటు సర్వేలో సేకరించిన వివరాలు ఆన్లైన్లో పొందుపర్చేందుకు 2,256 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను వినియోగించారు. సర్వే విధుల్లో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, మెప్మా రిసోర్స్పర్సన్లు, సీవోలతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, మండలస్థాయి అధికారులతో పాటు ప్రైవేట్ సిబ్బంది పాల్గొన్నారు. నవంబర్ 9 నుంచి 24 వరకు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టి, కుటుంబాల సమాచారాన్ని ప్రత్యేకంగా ముద్రించిన ఫాంలలో నమోదు చేశారు.
ప్రారంభానికి ముందు మంజూరు.. తర్వాత వెనక్కి..
అనుకున్నట్టుగా పదిహేను రోజులపాటు సిబ్బంది సర్వే చేసి పూర్తి వివరాలు సేకరించగా, అందులో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు ఒక్కొక్కరికీ 10వేలు, సూపర్వైజర్లకు 12వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రైవేట్ వ్యక్తులైతే ఒక్క షిప్టుకు 750 చొప్పున, ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే కాంట్రాక్టు ఆపరేటర్లకు అయితే 350 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే ప్రారంభానికి ముందే నిధులు విడుదల చేసింది.
సర్వే పూర్తికాగానే సిబ్బంది ఖాతాల్లో జమచేయాలంటూ సూచించగా, అందుకనుగుణంగా అధికారులు సిద్ధమయ్యారు. సిబ్బంది బ్యాంకు ఖాతాల వివరాలు జిల్లా కోశాగార కార్యాలయానికి అందజేశారు. అయితే, అంతలోనే ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు వెనక్కుతీసుకుని, ఇతర అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తుండగా, పారితోషికం కోసం సిబ్బంది పడుతున్న బాధలు వర్ణణాతీతంగా మారాయి. సర్వే చేసినవారిలో కొద్దిమంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుండగా, మిగిలినవారు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులే.
ప్రభుత్వం పారితోషికం అందిస్తున్నామని సంబంధిత సంస్థలకు పేర్కొనడంతో వారు విధులు నిర్వహించే సంస్థలు పదిహేను రోజుల వేతనం ఇవ్వలేదు. ఫలితంగా అటు రెమ్యూనరేషన్ రాక, ఇటు వేతనం రాక నరకం చూశారు. మరోవైపు అసలు పారితోషికమే పంపిణీ చేయరంటూ కొంతమంది ప్రచారం చేస్తుండగా, రోజులతరబడి తాము పడ్డ కష్టం ఉత్తదేనా..? అని ఆందోళన చెందుతున్నారు. అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారి పోతున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. అసలే అత్తెసరు వేతనంతో బతుకుతున్న తమను ఇలా ఇబ్బందులు పెట్టొద్దని, వెంటనే పారితోషికం విడుదల చేయాలని కోరుతున్నారు.
ఇస్తరా.. ఇవ్వరా..?
పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు కుటుంబం, పిల్లలను వదిలి సమగ్ర ఇంటింటి సర్వే చేశాం. సర్వే ముగిసిన వెంటనే రెమ్యూనరేషన్ జమచేస్తామని అధికారులు చెప్పారు. కానీ, ఐదు నెలలైనా డబ్బులు జమ కాలేదు. మాతో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను కూడా సర్వే కోసం తీసుకెళ్లాం. వారు డబ్బుల కోసం మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. గతంలో ఎన్నో సర్వేలు చేసినం కానీ ఇలా ఇబ్బంది కాలేదు. కొంతమంది సర్వే డబ్బులు ఇక రావని అంటున్నరు. డబ్బులివ్వకపోతే ఎలా..? ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు ఎవరు చెల్లించాలి? ఇది కరెక్టు కాదు. వెంటనే పారితోషికం విడుదల చేయాలి.
– విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్