Koppula Eshwar | ధర్మారం, నవంబర్ 11 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని మరణించిన గొర్రెలకు తగిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించి బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. నాలుగు మందలలో పెంచుతున్న గొర్రెలు గ్రామ శివారులలోని కోసిన వరి పొలాలలో మేతకు వెళ్లి విషాహారం తిని అస్వస్థతకు గురై ఈ నెల 7, 8 తేదీలలో 42 గొర్రెలు మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం నాలుగు రోజుల వ్యవధిలో మరో 20 గొర్రెలు మరణించాయి. దీంతో మూగజీవాల మరణం సంఖ్య 62 కు పెరిగింది. కాగా రాష్ట్ర మాజీ మంత్రి ఈశ్వర్ బాధిత గొర్రెల పెంపకం దారులను బుధవారం పరామర్శించి వారితో మాట్లాడారు.
ఊరి శివార్లలో మేత కోసం వెళ్లి విషాహారం గొర్రెలు మరణించాయని వారు ఈశ్వర్ కు వివరించారు. గొర్రెలను పెంచుతూ ఉపాధి పొందే తాము ఇటీవల అవి పెద్ద సంఖ్యలో మరణించడంతో తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఈశ్వర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం ఇప్పించాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇంకా కొన్ని మూగజీవాలు కూడా అస్వస్థత ఉన్నాయని అవి కూడా మరణించే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు మరణించిన రోజు వెటర్నరీ అధికారులు వచ్చి మిగతా వాటికి చికిత్స చేశారని ఆ శాఖ సిబ్బంది ఇప్పటికీ కన్నెత్తి చూడలేదని వారు ఈశ్వర్ దృష్టికి తీసుకువచ్చారు.
చికిత్సకు మందులు లేవని వెటర్నరీ శాఖ వారు అంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు . దీంతో తాము విధి లేని పరిస్థితుల్లో మూగజీవాలను కాపాడుకోవడానికి సొంతగా ఖర్చులు పెట్టి మందులు కొని మూగజీవాలకు చేయించుకుంటున్నామని వారు వివరించారు. బాధితులు వివరాలు చెప్పిన అనంతరం ఈశ్వర్ వెటర్నరీ శాఖ జిల్లా జెడీ ఫోన్ లో మాట్లాడారు. విషాహారం తిని 62 గొర్రెలు మరణించినందున వాటికి ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ధర్మారం వెటర్నరీ డాక్టర్ అజయ్ కుమార్ తో మాజీ మంత్రి ఈశ్వర్ ఫోన్ లో మాట్లాడి ఇంకా అస్వస్థత గురైన గురైన మూగజీవాలకు తగిన చికిత్స అందించి అవి కోలుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం బాధిత గొర్రెల పెంపకం దారులతో మాట్లాడిన ఈశ్వర్ పెద్దపల్లి కలెక్టర్ తో మాట్లాడి మరణించిన గొర్రెలకు తగిన పరిహారం అందించడానికి కృషి చేస్తానని ఆయన వారికి అభయం ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేట గ్రామంలో బుధవారం పర్యటించి ఇటీవల ఆరోగ్య కారణాలతో మరణించిన పబ్బతి మునెమ్మ, మెంగని రాయమల్లు, లక్ష్మీ కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాల ఇంటికి వెళ్లి మృతుల చిత్రపటాల కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆయా కార్యక్రమాలలో మాజీ మంత్రి ఈశ్వర్ వెంట నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ఆర్ బి ఎస్ జిల్లా మాజీ సభ్యుడు పూస్కూరు రామారావు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి మల్లారెడ్డి ,పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, పార్టీ నాయకులు మొట్టె శంకరయ్య, సత్తనవేని సదయ్య, అజ్మీర మల్లేశం, అజ్మీర తిరుపతి,అయిత వెంకటస్వామి, కాంపల్లి చంద్రశేఖర్, ఆవుల శ్రీనివాస్, రాగుల చిన్న మల్లేశం, ఆవుల వేణు, ఉప్పుల శ్రీనివాస్, గుజ్జుల మహేందర్ రెడ్డి, పెట్టెం అంజి, మెంగని అంజయ్య తదితరులు ఉన్నారు.