కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 24 : తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026-27 విద్యాసంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకారవేతనాల మంజూరు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎం అనిల్‌ప్రకాశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన ప్రతి బీసీ, ఈబీసీ విద్యార్థికి ఏడాదికి రూ.4 వేల చొప్పున మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఆధార్ అనుసంధానిత బ్యాంకులో డీబీటీ విధానంలో జమ చేయనున్నట్లు వెల్లడించారు.
ఔత్సాహికులైన ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో వన్‌టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా పూర్తి చేసి, ఓటీఆర్ నెంబర్ పొందాలని సూచించారు. అనంతరం తెలంగాణ ఈ-పాస్ పోర్టల్‌లో ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను అప్లోడ్ చేయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, నోడల్ అధికారులు విద్యార్థులతో దరఖాస్తులు చేయించి, హార్డ్‌కాపీలు సంబంధితాధికారులకు అప్పగించాలని సూచించారు.