Sand trucks | మానకొండూరు రూరల్, నవంబర్ 28: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని మహిళలు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. సుమారు 30 నిమిషాల పాటు ధర్నా చేపట్టగా సమాచారమందుకున్న సీఐ సంజీవ్ సంఘటన స్థలాన్ని చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నాను విరమించారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నిత్యం వాహనాల రద్దీతో దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శీతాకాలం కావడంతో ఉదయాన్నే దుమ్మూ, దూళీ పీల్చుకోవడం ద్వారా వృద్ధులు, పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు, చెస్ట్, లంగ్స్ సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గత కొన్ని రోజులుగా ఎంత చెప్పిన తగిన చర్యలు తీసుకోవడం లేదని ధర్నాకు దిగామన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.