మెట్పల్లి రూరల్, ఆగస్టు 13: ‘ఒక్కగానొక్క కొడుకువి. మంచిగా చదువుకొని ప్రయోజకుడివి అవుతావని ఆశలు పెట్టుకున్న. నువ్వు లేకుండా నేనెట్లా బతకాలి కొడుకా’ అంటూ పెద్దాపూర్ గురుకులంలో అనిరుధ్కు చెందిన సందుగ (బాక్సు)పై పడి తల్లి ప్రియాంక తల్లడిల్లిపోయింది. కొడుకును తలుచుకుంటూ ఆమె చేసిన రోదనలు అక్కడున్న వారి హృదయాలను కలిచివేశాయి. మంగళవారం డిప్యూటీ సీఎం పాఠశాలకు వచ్చిన నేపథ్యంలో అనిరుధ్ తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించారు.
కాగా, ప్రియాంక నేరుగా తన కొడుకు ఉండే గదిలోకి వెళ్లి కొడుకు సందుగపై పడి బోరున విలపించింది. సందుగను తెరిచి అనిరుధ్ వినియోగించిన బట్టలు, వస్తువులను చూసి తల్లడిల్లిపోయింది. డిప్యూటీ సీఎంతో నిర్వహించిన సమావేశంలోనూ తన కొడుకును తలుచుకుంటూ కన్నీరుమున్నీరైంది.
తన కొడుకు అనిరుధ్ పాముకాటుతోనే చనిపోయాడని, సకాలంలో స్పందించి ఉంటే బతికెటోడని చెప్పింది. గురుకులంలోనే చనిపోయిన నా బిడ్డను చికిత్స కోసమని దవాఖానకు తీసుకెళ్లి డ్రామాలు ఆడారని మండిపడ్డది. ఉదయమే తన బిడ్డ బాడీ పూర్తిగా చల్లబడిపోయిందని, చనిపోయిన తర్వాత ఎన్ని గంటలకు బాడీ చల్లబడుతుందో ఒక వైద్యుడిగా మీరు చెప్పాలని డిప్యూటీ సీఎంను అడిగింది. ఈ కడుపుకోత ఏ తల్లికీ రాకుండా చూడాలని వేడుకున్నది.