కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 27 : అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. అద్దె గదుల్లో కొనసాగుతున్న సెంటర్లలో ఇరుకు గదులు, పొగ, ఘాటు వాసనతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా శాశ్వత భవనాలు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించామంటూ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బాధ్యతలు తీసుకున్న సందర్భంగా చేసిన ప్రకటన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. సొంత భవనాల నిర్మాణ ప్రకటన కాగితాలకే పరిమితం కాగా.. ఓవైపు బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహార వంటలు, మరోవైపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యాబోధన ఒకే గదిలో కొనసాగుతున్నది.
దీంతో ఇటు లబ్ధిదారులు, అటు బాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నామమాత్రంగా ఒకటో, రెండు చోట్ల మాత్రమే సొంత భవనాల నిర్మాణాలు ప్రారంభించినా అవి పునాదులను వీడడం లేదనే ఆరోపణలున్నాయి. ఇచ్చిన హామీని అటకెక్కించి ఉన్న వాటికే మెరుగులు దిద్దడం ఏమేరకు సముచితమో స్పష్టం చేయాలనే డిమాండ్ నిర్వాహకుల నుంచి వస్తోంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న చోట శాశ్వత ప్రాతిపదికన కొత్త భవనాలు నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవసరమైన ప్రతిపాదనలు రూపొందించారు. అయితే, గతేడాది ప్రభుత్వం మారడంతో వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. తమ హయాంలో తిరిగి కొత్తగా నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పలు సభల్లో ప్రకటించారు. అద్దె భవనాలున్న చోట సొంత గదులు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో కొన్నిచోట్ల నూతన భవనాల నిర్మాణానికి భూమి పూజలు కూడా చేశారు. అయితే, నిధుల లేమితో పునాదుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో నాలుగు అంగన్వాడీ ప్రాజెక్టులు ఉండగా, వీటి పరిధిలో 777 కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిలో 291 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉండగా, మరో 231 సెంటర్లు ఉచిత అద్దె ప్రాతిపదికన ప్రాథమిక పాఠశాలలు, గ్రామపంచాయతీలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. మిగతా 255 కేంద్రాలు మాత్రం అద్దె భవనాల్లోనే సాగుతున్నాయి. వీటికి కూడా ఏడాదికో, ఆర్నెళ్లకో అన్నట్లు అద్దె చెల్లిస్తుండగా, నిర్వాహకులపై ఇళ్ల యజమానులు మండిపడడం సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో సెంటర్లను పదే పదే మార్చుతుండడం షరా మామూలైంది. ఇది నిర్వాహకులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇబ్బందికరంగా మారింది. ఆరేళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ చేయడం, లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించడంలో నిర్వాహకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు.