అంగన్వాడీలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. గర్భిణులు, బాలింతలు,చిన్నారులకు పౌష్టికాహారం, పూర్వప్రాథమిక విద్య అందించే టీచర్లను నిర్లక్ష్యం చేస్తున్నది. కరీంనగర్ జిల్లాలోని పలు సెంటర్లను ఇటీవల అప్‌గ్రేడ్ చేయగా, అందులోని టీచర్లకు ఆయాల జీతమే ఇస్తూ పొట్ట కొడుతున్నది. కేవలం రెండు, మూడు నెలలు మాత్రమే కొత్త వేతనాలు అందించి ఆ తర్వాత నెలల నుంచి చేతులు దులుపుకోగా, కుటుంబాలకు ఆవేదనే మిగిలింది.
కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 8: కరీంనగర్ జిల్లాలోని నాలుగు అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో 777 కేంద్రాలుండగా, వీటిలో 752 మెయిన్, 25 మినీ సెంటర్లు ఉన్నాయి. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మినీ సెంటర్లను అప్‌గ్రేడ్ చేయాలని సూచిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. స్పందించిన కేంద్ర మాతా శిశు సంక్షేమశాఖ వీటి హోదా పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలోని మినీ సెంటర్లన్నీ అప్గ్రేడయ్యాయి. వాటిలో విధులు నిర్వహిస్తున్న టీచర్లకు వేతనం 7,500 నుంచి 13,500 పెంచడంతోపాటు సహాయకులనూ నియమించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే పెంచిన వేతనాలు మాత్రం కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి విడుదల చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం, ఈ యేడాది ఏప్రిల్ నెల నుంచి రెండు, మూడు నెలల పాటు కొత్త వేతనాలు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత నెలల నుంచి మాత్రం మళ్లీ పాత వేతనమే విడుదల చేస్తున్నది.
ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే సాంకేతిక సమస్యలను కారణంగా చూపుతున్నట్టు తెలుస్తున్నది. అధికారులు మాత్రం అప్‌గ్రేడ్ అయిన సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న టీచర్ల వివరాలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు పంపినా, అక్కడ నుంచి ఫైనాన్స్ విభాగానికి చేరకపోవడంతోనే సమస్య ఉత్పన్నమైందని టీచర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర పరిశీలన చేసి, వెంటనే ఫైనాన్స్ విభాగానికి పంపాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.