రవీంద్రభారతి, మార్చి 3: బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని, పీవీకి అత్యున్నత భారత రత్నం అవార్డు ఇవ్వడం భారతదేశానికే గర్వకారణమని శాసనసభా వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న అవార్డు వచ్చిన సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో పురస్కార సభ నిర్వహించారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసీ కన్వీనర్ జమాలాపురం శ్రీనివాస్ సభా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, పీవీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పీవీ కుమార్తె శారదమ్మను సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన గొప్ప మేధావని, దేశంలో అనేక సంస్కరణలు తెచ్చాడని, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురుకులను స్థాపించారని చెప్పారు. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూపరిమితి చట్టం ప్రవేశపెట్టి తన వందల ఎకరాల భూములను దారాదత్తం చేశారని ప్రశంసించారు. ప్రభుత్వం బ్రాహ్మణుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, పీవీ ప్రభాకర్‌రావు, తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసీ కన్వీనర్ జమాలాపురం శ్రీనివాస్, చకిలం అనిల్, రజీనిరావు, డా.యజ్ఞం పవన్‌కుమార్ శర్మ, గూడ రాజేశ్వరరావు, లత తదితరులు పాల్గొన్నారు.