Geeta Vidyalayam | జగిత్యాల, జూలై 5 : విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ అన్నారు. సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పాఠశాల 1995-96 బ్యాచ్‌కు చెందిన పదో తనగతి విద్యార్థులు పాఠశాలకు రూ.లక్ష విలువైన డెస్క్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలు కేవలం ర్యాంకుల సాధన కోసం మాత్రమే పాకులాడు తున్నాయని, ఒక్క సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీతా విద్యాలయం మాత్రమే చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి లాంటి లక్షణాలు అందిస్తోందని తెలిపారు.
సంస్కారం లేని చదువు వ్యర్థమని ప్రతీ ఒక్కరూ చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణను అలవర్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్నమనేని అశోకరావు, బండారి కమలాకర్ రావు, తాళ్ల పెళ్లి లక్ష్మణరావు, అనంతుల కిషోర్, గడ్డం మహిపాల్ రెడ్డి, కంది రాజేశం, కట్టా చంద్రశేఖర్, బెజ్జంకి సంపూర్ణ చారి, జిట్టవేణి అరుణ్ కుమార్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.