ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 22 : మట్టితో ఏకంగా చెరువును పూడ్చేసి పొలం చేసి దర్జాగా కబ్జా చేశారు. చెరువు విస్తీర్ణం తగ్గిపోతుందని ఆందోళన చెందిన ఓ రైతు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పొలం అచ్చుకట్టే పనులను ఏఈ నిలిపేశారు. ఈ ఘటన ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామంలోని గాలన్ చెరువు కబ్జాకు గురయ్యే ప్రయత్నం జరుగుతున్నదని, అనుమతి లేకుండా చెరువు కట్టకు బలం చేకూర్చే మర్రి చెట్టును కొందరు నరికి వేశారని, ఇరిగేషన్ అధికారులకు అదే గ్రామానికి చెందిన రైతు గోగూరి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. అయితే, ఆదివారం అధికారులు సెలవుల్లో ఉంటారని తెలిసి ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
చెరువులో మట్టిపోసి దున్నుతున్న రైతును వివరణ అడిగితే తాను మండలంలోని కాంగ్రెస్ నాయకుడికి, చెప్పి దున్నుతున్నట్లు తెలపడంతో చెరువు కబ్జా చేసే అధికారం అతనికి ఎక్కడిదని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఏఈ భాస్కర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు.
నీళ్లు లేని సమయంలో ఏక్పసల్ పంట వేసుకోవచ్చని, కానీ చెరువులో అచ్చుకట్టడం నేరమే అవుతుందని వివరణ ఇచ్చాడు. వెంటనే చెరువులో పోసిన అడ్డుకట్టను తొలగించాలని రైతుకు సూచించారు. చెరువులో ఎలాంటి పంట వేయకూడదని, వేస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. అలాగే, కట్టపై కొందరు నరికివేసిన చెట్ల విషయాన్ని రైతు ఏఈకి తెలుపగా, అది తమ పరిధి కాదని ఏఈ బదులిచ్చారు. చెట్ల రక్షణకు బాధ్యులెవరో చెప్పాలని రైతు గోగూరి శ్రీనివాస్‌రెడ్డి ఏఈని నిలదీశారు.