వీణవంక, ఆగస్టు 05: కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లిలో నిర్మించిన ఎల్లమ్మ గుడి కాంపౌండ్ వాల్ నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఫిర్యాదుపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గీతకార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మందుల నిల్వలను, ఓపీ, ఐపీ రిజిస్టర్లను పరిశీలించారు. అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెల్సుకున్నారు.
సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మెడికల్ క్యాంపులు నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల హాజరు నమోదును పరిశీలించి, బరువు తక్కువ ఉన్న వారి వివరాలు అడిగి తెల్సుకున్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి కరీంనగర్ ఎన్నార్సీ కేంద్రానికి రెఫర్ చేయాలని సూచించారు. అంగన్వాడీలో ఇచ్చే డైట్ మోనూ అందరికీ కనబడే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మేరుగు శ్రీధర్, ఎంపీఓ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.