జమ్మికుంట, మార్చి 3: జమ్మికుంట మున్సిపల్‌కు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2159. 88 లక్షల అంచనాతో బడ్జెట్‌ను రూపొందించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. కేటాయించిన బడ్జెట్‌తో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, నాణ్యతా ప్రమాణాలతో పనులు కొనసాగాలని సూచించారు. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్, హుజూరాబాద్ ఆర్డీవో హరిసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ కే సమ్మయ్య ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంశాలను చదివి వినిపించారు. ఒక్కో అంశంపై చర్చించిన అనంతరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. ఆర్థిక సంవత్సర ఆదాయం రూ. 2167.07 లక్షలుగా ఉందని, మున్సిపల్‌కు వచ్చిన ప్రతి పైసా ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలని సూచించారు. అలాగే పనులు జరుగుతున్న సమయంలో నాణ్యతా ప్రమాణాలపై కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కూర్పు బాగుందని, జమ్మికుంటను జిల్లాలోనే అత్యుత్తమ మున్సిపల్‌గా తీర్చిదిద్దుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని కంటి వెలుగు శిబిరాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న, మేనేజర్ భూపాల్‌రెడ్డి, జేఏవో విమల, డీఈ ప్రభాకర్, ఏఈ చంద్రకళ, టీపీఎస్ ప్రదీప్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.